సిటీబ్యూరో: కంచె చేను మేసిన చందంగా తయారైంది… ఆ హెచ్ఎండీఏ భూమి తీరు. విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు కాపలాగా ఓ సెక్యూరిటీ గార్డును నియమిస్తే అతనే ఆ భూమి కబ్జా కథను నడిపిస్తుండటం గమనార్హం. మియాపూర్లో హెచ్ఎండీఏకు సంబంధించి భారీ విస్తీర్ణంలోనే భూములు ఉన్నాయి. సర్వేనంబర్ 100లో ఉన్న భూముల్లో కొంతకాలం కిందట వివిధ జిల్లాల నుంచి వచ్చిన నిరుపేదలు పెద్ద ఎత్తున గుడిసెలు వేసేందుకు సిద్ధం కావడం… చివరకు పోలీసుల సహకారంతో హెచ్ఎండీఏ అధికారులు వారిని వెనక్కి పంపించడం తెలిసిందే.
ఈ క్రమంలో దానికి సమీపంలోనే సర్వేనంబర్ 20,21ల్లో కూడా సుమారు 2500 చదరపు గజాల స్థలం ఉంది. మియాపూర్-బొల్లారం రహదారికి అనుసరించి ఉండటంతో ఈ భూమి విలువ గజం దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ఆ భూమికి రక్షణగా ఒక సెక్యూరిటీ గార్డును నియమించారు. క్రమేణా అతను అక్కడే చిన్నపాటి గుడిసెలు వేయించడంతో పాటు హోటల్ వంటి చిన్నపాటి వ్యాపారాలకు షెడ్లు వేసేందుకు సహకరించారు.
అంతేకాదు వారి నుంచి నెలకు అద్దె కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ విషయం హెచ్ఎండీఏ అధికారులకు తెలియకుండా ఉండదు. కానీ ఎందుకు పట్టించుకోవడంలేదనేది సందేహాలకు కారణమవుతున్నది. ఇదే అదునుగా భావించిన సదరు సెక్యూరిటీ గార్డు ఒక మహిళ పేరిట జీవో 59 కింద దరఖాస్తు చేయించి ఆ స్థలాన్ని కాజేసేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయం సమాచారం.ఈ తతంగంలో కొందరు స్థానిక నేతల హస్తం కూడా ఉందనే ఆరోపణలున్నాయి.