బేగంపేట, జూలై 16: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా శుక్రవారం మహంకాళి అమ్మవారు శాకాంబరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. దీంతో లష్కర్లో పండగ శోభ సంతరించుకుంది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోని కుంకుమార్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున వడి బియ్యం సమర్పించారు. అనంతరం, అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దేవాలయాన్ని వివిధ రకాల కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంరించారు.
ఈ నెల 11వ తేదీ నుంచే అమ్మవారి ఘటోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో అమ్మవారి ఘటాన్ని ఊరేగిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ ఘటోత్సవం కొనసాగుతుందని అనంతరం, 25న బోనాలు, 26న రంగం వేడుకలు నిర్వహించనున్నట్టు ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు.