మారేడ్‌పల్లి, మే 20: రైళ్లలో ప్రయాణికులపై దాడి చేసి.. బలవంతంగా డబ్బులు లాక్కెళ్తున్న ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు హిజ్రాలు, ఒక మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.10వేలను రికవరీ చేశారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తో కలిసి రై ల్వే డీఎస్పీ ఎస్.ఎన్ జావెద్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ ప్రాంతానికి చెందిన పల్లి సూర్య భానుప్రకాశ్ అలియాస్ జాన్వీ (24) అదే ప్రాంతానికి చెందిన మాదాసు విజయ్ అలియాస్ వినీత ( 24), చెరుకు సాయి కుమార్ అలియాస్ సాత్విక (31)తో పాటు మరో మైనర్ బాలుడికి హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడింది. సూరారం సాయిబాబా కాలనీలో ఉంటూ మొదట వీళ్లు భిక్షాటన చేసేవారు. ఆ తర్వాత రైళ్లలో ప్రయాణికులను డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు లాక్కొని పారిపోతుంటారు. అలా ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున వీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి వరంగల్ వరకు వెళ్లి, తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో రైలు మౌలాలి స్టేషన్ దాటి తర్వాత హిజ్రాలు ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు.
అలా ఓ యువకుడిని డబ్బులు డిమాండ్ చేయగా.. అతను నిరాకరించడంతో అతనిపై దాడి చేసి పర్సులో ఉన్న రూ.10వేలు లాక్కున్నారు. అనంతరం రైలు జనగాం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు దిగి పారిపోయారు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.