సికింద్రాబాద్, నవంబర్ 5: ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి మెట్టు దిగారు. అధికార పార్టీ టీఆర్ఎస్కు సమాచారం ఇవ్వకుండానే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2022లో భాగంగా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ నెల 3న బోర్డు కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యేకు గాని, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, ఇతర బోర్డు మాజీ సభ్యులకు సమాచారం తెలుపకుండానే తూతూ మంత్రంగా అధికారులు సమావేశం నిర్వహించడంపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఇష్టారాజ్యంగా…ఒంటెద్దు పోకడలు’ అనే శీర్షక ప్రచరితమైంది.
దీంతో నమస్తే తెలంగాణ ఎఫెక్ట్‌తో కంగారెత్తిన బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి అత్యవసరంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులకు సమాచారమిస్తూ శుక్రవారం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ అజిత్‌రెడ్డి నేతృత్వంలో డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా నవీకరణకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు సహకరించాలని బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి కోరారు.
రాజకీయ పార్టీలు బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2022లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఈనెల 1న ప్రకటించామని, 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. జనవరి 1, 2022 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని, ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఈనెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అజిత్‌రెడ్డి తెలిపారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై జరిగిన సమావేశంలో పలు అంశాలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ప్రస్తావించారు. ప్రధానంగా బోర్డు పరిధిలో ఏర్పాటు చేసే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే సాయన్నను పిలవకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నూతన ఓటర్ల చేరికతో పాటు తొలగించిన ఓట్లను పునరుద్ధరించడం, నకిలీ ఓట్లను తొలగించడం, చనిపోయిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను అధికారులు సక్రమంగా చేయకపోవడంపై పెదవి విరిచారు. బోర్డు పరిధిలోని పోలింగ్ స్టేషన్ల మార్పు, క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలోని లోటుపాట్లను సమీక్షించుకోవాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల బోర్డుకు అప్రతిష్ట వస్తుందంటూ పలువురు అధికారులపై కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బాధ్యతలు అప్పగిస్తే ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచి పద్ధ్దతి కాదని, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదనే అంశంపై అధికారులను మందలించినట్లు సమాచారం.