నిత్యం అధ్వానంగా దర్శనమిచ్చే ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయి. ఇంటింటికీ నీళ్ల డబ్బాలు అందించే నాటి నుంచి నేడు ఇంటి ముందరే కుళాయిలు తిప్పుకునే పరిస్థితి నెలకొంది. అడుగుకో గుంతతో ఇబ్బందులు పడ్డ బస్తీవాసులకు, అద్దంలా మెరిసే సీసీ రోడ్లు కండ్ల ముందు కదలాడుతున్నాయి. అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. వార్డులోని ముఖ్య ప్రాంతాల్లో ప్రజా అవసరాలకు సంబంధించిన సేవలు ఆయా కాలనీల పరిసర ప్రాంతాల్లోనే అందుతున్నాయి. గత ఆరేళ్లలో ఒకటో వార్డు పరిధిలోని బస్తీలు, కాలనీల రూపు రేఖలే మారిపోయాయి. ఒకటవ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారుల ఇంటికే చేరేలా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి కీలక భూమిక పోషించారు. వార్డు పరిధిలో బాపూజీనగర్, నేతాజీనగర్, కంసారి బజార్, సంజీవయ్యనగర్, పెన్షన్లైన్, సెవన్టెంపుల్, చిన్నతోకట్టలో జరిగిన అభివృద్ధితో పాటు త్వరలో కమ్యూనిటీ హాల్స్‌లో అదనపు గదుల నిర్మాణ పనులే నిదర్శనం.
కంటోన్మెంట్ బోర్డు నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎమ్మెల్యే సాయన్న కోటా నుంచి విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి. గత ఏడాది కాలంలోనే ఒకటో వార్డులోని పలు బస్తీలు, కాలనీల్లో రూ.71లక్షల 75వేల వ్యయంతో బీటీ రోడ్లు నిర్మించారు. రూ.44లక్షల 2వేల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టగా, రూ. రెండు కోట్ల వ్యయంతో సామాన్యులకు అవసరమయ్యే రీతిలో పదిహేను సామాజిక భవనాలను నిర్మించడం జరిగింది. సౌజన్య కాలనీతో పాటు మరో నాలుగు కాలనీల్లో రూ.15 లక్షలతో బోర్లను వేయించారు. బాపూజీనగర్‌లోని పలు బస్తీల్లో గత ఆరేళ్లలో చేపట్టిన రూ.రెండు కోట్ల 28లక్షల 85వేల వ్యయంతో అభివృద్ధి చేపట్టారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరేళ్లలోనే అభివృద్ధి అంటే ఏంటో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి చేతల్లో చేసి చూపించాడు.ఎమ్మెల్యే సాయన్న నిధుల నుంచి సుమారు రూ.30లక్షల నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా నేతాజీనగర్ కమ్యూనిటీ హాల్లో అదనపు గదుల నిర్మాణానికి రూ. 20లక్షలు, బాపూజీనగర్ కమ్యూనిటీ హాల్ అదనపు గదుల నిర్మాణానికి రూ. 10 లక్షలతో పనులు త్వరితగతిన ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. న్యూ సిటీ కాలనీలో భూగర్భ డ్రైనేజీ ఆధునీకరణకు ఎమ్మెల్యే సాయన్న కోటా నిధుల నుంచి రూ.8లక్షల మేర మజూరు చేయించి అభివృద్ధికి పునాది వేస్తున్నారు.
బోర్డు నిధులతో పాటు ఎమ్మెల్యే సాయన్న కోటా నుంచి విడుదలైన నిధులతో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఒకటో వార్డు అభివృద్ధి పథంలో ముందుకుసాగుతుంది. ఇప్పటికే వార్డులో 15 కమ్యూనిటీ హాళ్లు పూర్తయ్యాయి. మరో రూ.70లక్షల నిధులతో వివిధ పనులకు శ్రీకారం చుట్టనున్నాం. గత ఆరేళ్లలో కోట్ల రూపాయలు వెచ్చించడంతో వార్డు రూపు రేఖలు మారాయి. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇప్పిస్తున్నామన్నారు. జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు.