Alpha Hotel | సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లోని రెస్టారెంట్లు, హోటళ్లు ధనార్జనే ధ్యేయంగా.. నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, గడువు దాటిన పదార్థాలు, కల్తీ మసాలాలు వాడటమే కాకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలుతోంది. గడిచిన కొన్ని రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్న ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సికింద్రాబాద్ అల్ఫా హోటల్లో తనిఖీ చేశారు.
ఈ హోటల్లో పాడైన మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇక వంట గది అపరిశుభ్రంగా ఉండటం, నాసిరకంగా ఆహార పదార్థాలు ఉండటాన్ని గుర్తించారు. ఎప్పుడో తయారైన ఫుడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నట్లు కనుగొన్నారు. తెరిచి ఉన్న డస్ట్బిన్లు, సీలింగ్‌పై ప్లాస్టరింగ్ వంటి అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించారు. ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్లు తయారు తేదీ, టీ పొడి, బ్యాచ్ నంబర్లు లేకుండా ఉన్నాయి. దీంతో అల్ఫా హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రూ. లక్ష జరిమానా విధించారు.
హోటల్ సందర్శినిలో పరోటా ప్యాకెట్లు, నూడుల్స్ ప్యాకెట్లను , బెల్లం క్యూబ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో కిచెన్ ఉన్నదని గుర్తించారు. సికింద్రాబాద్‌లో రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో డస్ట్‌బిన్ ప్రాంతానికి సమీపంలో ఎలుకను గమనించారు. ఎలుకల ఉచ్చులు ఏర్పాటు చేయలేదు. వంటగదిలో సింథటిక్ ఫుడ్ కలర్‌ను గుర్తించారు. డస్ట్బిన్లకు మూతలు లేవు. సిబ్బందికి హెయిర్ క్యాప్‌లు లేకుండా ఉన్నారు. కిచెన్ అపరిశుభ్రంగా, దుమ్ముతో నిండిపోయినట్లు గుర్తించారు. సంబంధిత నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు.