సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ ): పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం కౌంటింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలు అనుసరిస్తూ కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నియమించిన అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించారు. జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. ఈ మేరకు కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ద్వారా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు కేటాయించారు. పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తాన్ని అబ్జర్వర్ల సమక్షంలో ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. మంగళవారం ఎర్లీ మార్నింగ్ మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పరిశీలకులు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియతో కౌంటింగ్ సిబ్బందిని టేబుల్‌కు కేటాయిస్తారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, సీఈఓ మధుకర్ నాయక్ పాల్గొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ సిబ్బందికి సంబంధించి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ప్రియాంక శుక్లా, జిల్లా కలెక్టర్ గౌతమ్ పూర్తి చేశారు. కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు.