కుత్బుల్లాపూర్,డిసెంబర్1: కుత్బుల్లాపూర్ షాపూర్‌నగర్‌లోని పూర్ణిమ హైస్కూల్లో ఆయా ఓ చిన్నారిని విచక్షణ రహితంగా కొట్టిన ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి, మండల విద్యాశాఖాధికారి జెమినితో పాటు జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశం, హ్యూమన్ రైట్స్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు సోమవారం స్కూల్‌ను సీజ్ చేశారు. నిందితురాలు లక్ష్మిపై జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కాగా ఆమెపై విచారణ కొనసాగుతుంది. 70 మంది పదో తరగతి విద్యార్థులను మరో స్కూల్‌కు పంపించేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 3న ఉదయం 10.30 గంటలకు విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఎంఈవో జెమిని జంగం తెలిపారు.
కలెక్టరేట్ కార్యాలయంలో హ్యూమన్‌రైట్స్ చైల్డ్ వెల్ఫేర్ అసోషియేషన్‌తో పాటు విద్యాశాఖాధికారుల సమక్షంలో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాలుగేండ్ల చిన్నారిపై కర్కశంగా ఆయా చేసిన దాడి హేయమైన చర్య అని ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. పాఠశాలలో గతంలో సదరు ఆయా దాడికి పాల్పడిందని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా పట్టించకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత లక్ష్మీనారాయణతో పాటు యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.