తాము చదువుకే బడికే తాళాలు వేయడంతో బడిబాట పట్టిన ఆ చిన్నారులు కలతచెందారు. తమకు చదువు చెప్పిన సార్లను బడిలోపలికి రానియకుండా చేసిన బస్తీ నేతల నిర్ణయానికి సిగ్గుపడ్డారు. పేద పిల్లలకు ఉచితంగా చదువునేర్పించడమే వాళ్లు చేసిన తప్పైంది. ఈ బస్తీలోని కమ్యూనిటీ హాల్లో చదువు అస్సలు చెప్పొద్దని 30 ఏండ్ల నుంచి ఎంతోమంది పేద విద్యార్థులకు ప్రాథమిక విద్యనందించిన విషయాన్ని మరిచి మరీ బస్తీ నేతలు బడికి తాళాలు వేశారు. దీంతో చిన్నారులంతా తాళం వేసిన పాఠశాల బయటే కూర్చోవాల్సి వచ్చింది. ఈ ఉదంతం పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌లో శుక్రవారంచోటుచేసుకుంది.
– బంజారాహిల్స్
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పంజాగుట్ట ప్రతాప్‌నగర్ బస్తీలోని రామాలయం ఆవరణలో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో సుమారు 30 ఏళ్లనుంచి సుశీలాదేవి మెమోరియల్ స్కూల్ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ వామన్‌రావు సహకారంతో ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. బస్తీలోని పేద పిల్లలను చేర్చుకుని 4వ తరగతి దాకా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. 2018లో వామన్ రావు మృతి చెందడంతో స్కూల్ బాధ్యతను అమెరికాలో ఉన్న ఆయన కుమార్తె మాలతి పర్యవేక్షిస్తున్నారు. గతంలో ప్రతి ఏడాది సుమారు 100 మంది విద్యార్థులు అందులో చేరగా, ప్రస్తుతం సుమారు 45 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఇటీవల కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్కూల్‌కు గుర్తింపు తప్పనిసరి అని విద్యాశాఖ అధికారులు చెప్పడంతో నిర్వాహకులు సుశీలా వామన్ రావు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో సంస్థను రిజిస్టర్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా, పలువురు కాంగ్రెస్ నేతలు పంజాగుట్ట బస్తీ కమిటీ పెద్దలను రెచ్చగొట్టి, స్కూల్ నిర్వాహకులపై వాగ్వాదానికి పంపించినట్లు సమాచారం. తమ బస్తీ అవసరాల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్లో స్కూల్ ఉండొద్దని హెచ్చరించారు. తమకు అనుకూలమైన చోటు దొరికితే ఖాళీ చేస్తామని స్కూల్ నిర్వాహకులు సమాధానమిచ్చినా కూడా వినిపించుకోకుండా వారం రోజుల కిందట కమ్యూనిటీహాల్‌కు తాళం వేశారు. కాగా వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పిల్లలు స్కూల్‌కు రావడం ప్రారంభించారు. కమ్యూనిటీహాల్లో నడుస్తున్న బడికి తాళం కనిపించడంతో బయటే కూర్చుని చదువుకుంటున్నారు.
ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ ప్రతాప్‌నగర్ చేరుకుని కమ్యూనిటీహాల్‌కు తాళం వేసే అధికారం బస్తీ కమిటీ నేతలకు లేదని, ఏదైనా సమస్యలు ఉంటే చట్టపరంగా చూసుకోవాలి తప్ప..పిల్లలను రోడ్డున పడేసే హక్కులేదని తేల్చిచెప్పారు.
వెంటనే తాళాలు తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడంతో, బస్తీ కమిటీ నేతలు తాళాలు తొలగించారు. రామాలయం ఆవరణలో కమ్యూనిటీహాల్‌ను తాత్కాలికంగా తామే స్కూల్ కోసం ఇచ్చామని, అయితే బస్తీవాసుల అవసరాలకు ఉపయోగించకుండా ప్రైవేటు స్కూల్ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసుకోవడంతోనే తాము తాళాలు వేశామని బస్తీ కమిటీ నేతలు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీతో పాటు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు..