రవీంద్రభారతి, ఫిబ్రవరి13: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో వర్గీకరణ చేసి మాలలకు తీరని ద్రోహం తల పెట్టిందని, కాంగ్రెస్ పార్టీ మాలలకు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ఈ నెల 14న ట్యాంక్‌బండ్‌పై గల అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వీఎల్ రాజు, జాతీయ కమిటీ గౌరవ అధ్యక్షుడు సుప్రీం కోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ, ఎస్సీ జాబితాలోని 57 కులాలకు రిజర్వేషన్ అవకాశాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ దళిత కుటుంబాలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
మాలలను తక్కువ జనాభాగా చూపించి ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. మాలలకు జరిగిన అన్యాయాలపై రిజర్వేషన్ హక్కుల కోసం పెద్ద పోరాటాలు, తిరుగుబాటు చేసి సాధించుకోకపోతే జాతికి బానిసత్వం తప్పదన్నారు. ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాల జాతి బిడ్డలు, మాల మహానాడు సంఘాలు, మహిళా విభాగాలు భారీగా పాల్గొని వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత బహుజన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు.