సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ) : మెట్రో భవన్లో వెలుగులోకి వచ్చిన అవకతవకలు చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లు మెట్రో ఎండీగా బాధ్యతలు నిర్వహించిన ఎన్వీఎస్ రెడ్డి.. ఇటీవలే ట్రాన్స్పోర్ట్ సలహాదారుడిగా నియమితులయ్యారు. కొత్త ఎండీ వచ్చినా పాలనపరమైన నిర్ణయాల్లో పాత ఎండీ పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. సెప్టెంబర్ 17న మెట్రో సంస్థకు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. కానీ పాత ఎండీ కనుసన్నల్లోనే పాలన వ్యవహారాలు సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా మెట్రో భవన్ వేదికగా జరిగిన కొన్ని అవకతవకలు వెలుగులోకి రాగా, ఇందులో కొత్త ఎండీ సహకారంతోనే పాత ఎండీ తట్టాబుట్టా సర్దుకునే పనిలో ఉన్నారని తెలిసింది. ఆయన సంబంధీకులకు ప్రమోషన్లతోపాటుగా, బిల్లుల విషయంలో రాజీ లేకుండా పాత కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నట్లుగా తెలిసింది. అర్హత లేకుండా, తెలంగాణేతరులైతే చాలన్నట్లుగా ఆత్మీయులకు అందలం ఎక్కిస్తున్న కార్యకలాపాలకు తెరలేపారని మెట్రో భవన్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్వీఎస్ రెడ్డి ఎండీగా ఉన్న సమయంలోనే అపాయింట్మెంట్ లెటర్లను ఇచ్చినట్లుగా జిమ్మిక్కులు జోరుగా సాగుతున్నాయట. తనను నమ్ముకుని ఇన్నాళ్లు వెలగబెట్టిన ఓ ఆంధ్రా వ్యక్తిని అందలం ఎక్కించేందుకు అర్హత లేకున్నా అతడికి ప్రమోషన్ కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా కొత్త, పాత ఎండీల నడుమ సాగుతున్న కొన్ని చిలక్కొట్టుడు వ్యవహారాలపై బాధితులే రోడ్డెక్కే పరిస్థితులు రావడంతో.. అసలు మెట్రో భవన్లో సాగుతున్న బాగోతాలు ఇప్పుడొక హాట్ టాపిక్‌గా మారాయి.
మెట్రో వ్యవహారాలను పర్యవేక్షించే భవన్లో అవకతవకలు సాగుతున్నాయని, అనర్హులను అందలం ఎక్కించడంతోపాటు, రిటైర్డ్ అయినా, విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతోపాటు, సంబంధీకులకు బిల్లుల కోసం ఏకంగా తేదీలను మార్చివేస్తున్నారనే సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్వీఎస్ రెడ్డిని ఎండీగా తప్పిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించిన మరుసటి రోజునే పూర్తి అదనపు బాధ్యతలను హెచ్ఎండీఏ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ స్వీకరించారు. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టు అడ్వైజరీగా ఎన్వీఎస్ రెడ్డిని నియమించుకున్నా.. ఆయన కూడా మెట్రో భవన్‌లోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన సంబంధీకులకు ఉన్న ప్రమోషన్ల వ్యవహారాలు, పెండింగ్ బిల్లులను చక్కబెట్టే పనిలో ఉన్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే మెట్రో భవన్లో హెచ్వోడీలుగా కొనసాగుతున్న డీవీఎస్ రాజు, ఎం విష్ణువర్ధన్ రెడ్డిలు అడ్డదారిలో ఆంధ్ర వ్యక్తులకు బ్యాక్ డేట్‌తో
ప్రమోషన్ లెటర్లను అందజేసినట్లుగా తెలిసింది. ఆంధ్రకు చెందిన ఈ ఇద్దరు వారికి కావాల్సిన ముగ్గురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి అనర్హులకు ప్రమోషన్లు ఇచ్చినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో డీవీఎస్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలదే కీలకపాత్ర అని, ఈ వ్యవహారం కూడా కొత్త ఎండీకి తెలిసే జరిగినట్లుగా మెట్రో భవన్లో చర్చ నడుస్తోంది.
నిబంధనలకు తిలోధకాలు వదిలినట్లుగా ఇన్నాళ్లు ఎండీ చేసిన నిర్వాహకాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సొంతంగా జుక్కల్, శంషాబాద్ సమీపంలో కట్టుకున్న ఫాంహౌజ్‌లకు మెట్రో సిబ్బందిని వినియోగిస్తున్నారని, గడిచిన రెండేళ్లుగా ఈ పనులు యథేచ్ఛగా సాగిస్తున్నారని, నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నారట.. ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో ఎవరైనా తనకు కావాల్సిన వ్యక్తులు ఉంటే గనుక… వారినే కన్సల్టెన్సీ నిర్వాహకులుగా, లేదా ఏజెన్సీ నిర్వాహకులుగా మళ్లీ విధుల్లోకి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలంగాణలో మెట్రో భవన్ ఉన్నా.. పెత్తనం మొత్తం ఆంధ్రా ఉద్యోగులదేనని, కొత్తగా ప్రమోషన్ పొందిన వారంతా కూడా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారేనని తెలంగాణవాదులు వాపోతున్నారు. ఆనంద్‌కుమార్ అనే వ్యక్తినికి ఐటీ మేనేజర్‌గా ప్రమోషన్ ఇవ్వడం, అది కూడా ఆయన ఎండీగా విధుల నుంచి తప్పుకున్న తర్వాత, పాత తేదీలతో అపాయింట్మెంట్ లెటర్ జారీ కావడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు మొత్తం 25మంది ఆంధ్రా ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో కొనసాగుతున్నారని, వీరంతా కూడా ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి కొనసాగిన సమయంలోనే జరిగిందనీ మెట్రో భవన్ బాధితులు తెలిపారు.
మొదటి దశ మెట్రో ప్రారంభమైనప్పుడు ఎన్వీఎస్ రెడ్డి మెట్రో సిబ్బందికి నైపుణ్యాలను పెంపొందించేలా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను మియాపూర్‌లోని మెట్రో డిపోలో ఏర్పాటు చేశారు. ఇందులో కొన్నేళ్లుగా ఉద్యోగులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే… ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా తెలిసింది. వీటిని కూడా తన కుటుంబీకులు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, నిత్యం తన కుమారులు ఈ సెంటర్‌కు వచ్చిపోతుంటారని సిబ్బంది పేర్కొన్నారు.
నిజానికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు తీసుకున్న తర్వాత పాత ఎండీకి ఎలాంటి అధికారాలు ఉండవు. కానీ గడిచిన 18ఏళ్లుగా మెట్రో భవన్‌పై తనకున్న పట్టును తెలుసుకుని, కొత్త ఎండీ కూడా ఆయనకు సహకరిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో పాత తేదీలతో నియామాక లేఖలు ఇచ్చినా.. చూసి, చూడనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. పెండింగ్ బిల్లుల విషయంలోనూ ఇదే పంథాలో పనులు చక్కబెట్టుకుంటున్నారని, దీనికి సంపూర్ణ మద్దతు ఇరువురి మధ్య ఉండటంతో, తమ లాంటి వారికి న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు. కొత్త ఎండీ రావడంతో..మెట్రో భవన్లో మార్పులు వస్తాయని భావిస్తే.. ఆయన కూడా అదే మార్గంలో నడుస్తూ తమలాంటి వారికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం ఇప్పటి వరకు జరిగిన వ్యవహారాలపై అటు కొత్త ఎండీగానీ, వివరణ కోరేందుకు ప్రయత్నించిన పాత ఎండీ గానీ స్పందించకపోవడం మెట్రో భవన్లో సాగుతున్న వ్యవహారాలపై మరింత అనుమానాస్పదంగా మారాయి.