సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ఒక మినీ ఇండియా. సంక్రాంతి పండుగను తమళినాడులో పొంగల్ పేరుతో చేస్తే.. గుజరాత్లో ఉత్తరాయణ్, పంజాబ్లో లోహ్రీ, ఒడిశాలో మకర చౌలా, మహారాష్ట్రలో మాఘి సంక్రాంతి, కశ్మీర్లో శిశుర్ సంక్రాంత్, యూపీ, బీహార్లో ఖిచ్ఢీ పర్వ్ పేరుతో పండుగ చేసుకుంటారు. పేరు ఏదైనా నగరంలో ఆయా రాష్ర్టాల ప్రజలు వేడుకలను వారి పద్ధతుల్లో ఘనంగా జరుపుకుంటున్నారు.
ఇంటి ముంగిట రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాల రెపరెపలు, విభిన్న రకాల పిండి వంటలతో తెలుగువారి సంక్రాంతి సందడి నగరంలో జోరుగా సాగుతున్నది. ఇంకోవైపు కాలనీల అసోసియేషన్ల ఆధ్వర్యంలో గేటెడ్ కమ్యూనిటీలన్నీ ఒకే వేదికపై సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్నారు.