Sand Rates | సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో ఇసుక కొనేదెట్ల.. ఇల్లు కట్టేదెట్ల? అనే పరిస్థితి నెలకొన్నది. భాగ్యనగరంలో సామాన్యుడి సొంతింటి కలకు ఇసుక ధరలు అడ్డుపడుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ప్రైవేటు ఇసుక ఏజెన్సీలను తొలగించడంతో ప్రభుత్వ ఇసుక బజార్లలో కొనాలంటే కొనలేని పరిస్థితి. టన్ను ఇసుక దొడ్డు రకం రూ.1600, సన్నరకం రూ.1800కు విక్రయిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటుచేసిన ఇసుక కొనుగోలు కేంద్రాలకు ‘ఇసుక బజార్’ అని పేరు మార్చారు.
ఈ కొనుగోలు కేంద్రాలు హైదరాబాద్ శివారు ప్రాంతాలైన వట్టినాగులపల్లి, భౌరంపేట, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇసుక కొనుగోలు చేయాలంటే రవాణా ఖర్చు తడిచి మోపెడవుతున్నది. అసలు ధర కంటే రవాణాకే జేబు ఖాళీ అవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటుగా ఇసుక విక్రయించుకునేందుకు అనుమతులు ఉండటంతో ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు అవి లేకపోవడంతో టన్ను ధర రూ.1600కు కొనుగోలు చేస్తే, రవాణా, బుకింగ్, ఇతర ఖర్చులతో కలిపి రూ.2000 పైనే అవుతున్నది. దీంతో సామాన్యుడు ఇల్లు కట్టడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇసుక బజార్ నుంచి కొనుగోలు చేయాలంటే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. కొనుగోలుదారుడే వాహనం తీసుకెళ్లాలి. ఒక్కో ట్రిప్పునకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన పది టన్నుల ఇసుక కొనుగోలుకు ప్రభుత్వ ధర కంటే అదనంగా మరో రూ.2 నుంచి 5 వేల వరకు అవుతున్నది. ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తే టన్ను ఇసుకపై రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుని ఎలాంటి రవాణా చార్జీలు తీసుకోకుండా ఇంటికొచ్చి అన్లోడ్ చేసి వెళ్తున్నారు. బుకింగ్, రవాణా కోసం తిరగాల్సిన పని ఉండదు. ఎలాంటి ఇబ్బందులు, వ్యయప్రయాసలు లేకుండా ఇసుక ఇంటికే వస్తున్నప్పుడు ప్రభుత్వ విక్రయ కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొంటున్నారు.
నగరంలోని ప్రైవేట్ ఇసుక కేంద్రాలను ప్రభుత్వం తొలగించినా ఇల్లు కట్టుకునేవారు ఇసుక బజార్ల వైపు వెళ్లడం లేదు. దీంతో అవి వెలవెలబోతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు ఇసుక రీచ్‌ల నుంచి నేరుగా ఇంటికే సరఫరా చేస్తుండటంతో వారినే ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, ఇసుక కూడా సులువుగా దొరకని పరిస్థితి నెలకొన్నదని బాధితులు వాపోతున్నారు.
కోకాపేటలో నాలుగు ఫ్లోర్ల ఇల్లు కడుతున్నా. 25 టన్నుల ఇసుక అవసరం ఉన్నది. తెలిసిన వ్యక్తి ద్వారా ప్రైవేట్ వారిని ఆశ్రయించా. రవాణా చార్జీతో కలిపి టన్నుకు రూ.1900 పడుతుంది. ఇంటి ముందుకు వచ్చి అన్లోడ్ చేసి వెళ్తున్నారు. ఇసుక బజార్లో తీసుకుందామంటే టన్ను రూ.1600 చెప్పిండ్రు. బుక్ చేసుకోవాలంటే నార్సింగి వెళ్లాలి. అక్కడ రశీదు తీసుకుని వట్టినాగులపల్లి ఇసుక బజార్‌కు వెళ్లాలి. వారికి రశీదు ఇచ్చి టిప్పర్‌ను కిరాయికి తీసుకెళ్లాలి. టిప్పర్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేలు అడుగుతున్నరు. ఇంత శ్రమ అక్కర్లేకుండానే ఒక్క ఫోన్‌తో ఇసుక ఇంటికే వస్తుంది. దీంతో ప్రైవేటుగానే కొనుగోలు చేస్తున్నా.
– అరికె కృష్ణ, కోకాపేట
ఫిల్మ్‌నగర్‌లో ఓ వ్యక్తి జీప్లస్ వన్ ఇల్లు కట్టుకుంటున్నాడు. వట్టినాగులపల్లి ఇసుక బజార్ నుంచి ఇసుక తెచ్చుకోవడానికి రవాణా చార్జీలు, బుకింగ్ కోసం తిరగడానికి కలిపి టన్నుకు రూ.2200 అవుతుంది. తెలిసిన వ్యక్తి ద్వారా అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ వ్యక్తిని సంప్రదించాడు. అత్తాపూర్ నుంచి ఎలాంటి బుకింగ్, రవాణా చార్జీ లేకుండానే రూ.2వేలకు టన్ను చొప్పున సరఫరా చేస్తున్నాడు. వ్యయప్రయాసలు లేకుండా ఇంటికే ఇసుక వస్తుండటంతో ప్రైవేటు నుంచే తెచ్చుకునేందుకు మొగ్గు చూపుతున్నాడు.