బేగంపేట్ : అర్హులైన పేద ప్రజలంతా తమకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడుపల్లిలోని తన కార్యాలయంలో ఆయన బాలానగర్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని సనత్ నగర్ డివిజన్‌కు చెందిన 12 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
10 మంది షాదీ ముబారక చెక్కులను, ఇద్దరు కళ్యాణలక్ష్మి చెక్కులను అందుకున్నారు. ఆడపడుచుల పెండ్లి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారంతో కూడుకున్నదని అన్నారు. వారికి కొంత చేయూత అందించి ఆదుకోవాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.
లబ్ధిపొందిన వారు అర్హులైన ఇతరులు కూడా పథకాలను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని తలసాని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది విజయ్, అజయ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, కరీం, అశోక్ యాదవ్, జమీర్, కూతురు నర్సింహ, బలరాం తదితరులు ఉన్నారు.