Baisakhi Tournament | అమీర్‌పేట : సిక్కు మత వ్యవస్థాపక దినోత్సవాన్ని (ఏప్రిల్ 14) పురస్కరించుకొని ప్రతి ఏటా అమీర్‌పేటలోని గురుగోవింద్ సింగ్ స్టేడియంలో నిర్వహించే క్రికెట్ పోటీలు ముగిశాయి. హైదరాబాద్ నగర నలుమూలల నుంచి వచ్చిన సిక్కు క్రీడాకారుల జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. ఈ నెల 6వ తేదీ నుంచి జరిగిన బైసాఖి క్రికెట్ పోటీల్లో అమీర్‌పేటకు చెందిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు టోర్నమెంట్ గెలిచింది. కిషన్‌బాగ్ జట్టు రెండో స్థానంలో నిలిచింది.
బైసాఖి టోర్నమెంట్లో విజేతలకు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బహుమతులు అందజేశారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వారిలో సిక్కులు అందరికంటే ముందు వరసలో ఉంటారని అన్నారు. ప్రతి ఏటా జరుపుకునే బైసాఖి వేడుకల్లో భాగస్వాములు అయ్యేందుకు నగర నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా సిక్కులు అశేషంగా తరలివస్తుండటం ఆనవాయితీ అయినందున, వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమీర్‌పేట బీఆర్ఎస్ అధ్యక్షులు సంతోశ్ మణికుమార్, దాడి ప్రవీణ్ రెడ్డి, అమీర్‌పేట గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షులు సర్దార్ దర్శన్ సింగ్, ప్రతినిధులు సురేందర్ సింగ్, నరేందర్ సింగ్, సుమిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు