కుత్బుల్లాపూర్, జూలై 14: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి, నిరుద్యోగులకు మోసపూరిత హామీలపై సమరశంఖం పూరించేందుకు యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ యువత భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సు విజయవంతం కోసం పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివేకానంద్, శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందన్నారు. సంక్షేమ పథకాలను సైతం సక్రమంగా కొనసాగించలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం పని చేస్తుందని, తెలంగాణ యువత హక్కుల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కుత్బుల్లాపూర్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.