సిటీబ్యూరో: పశువుల నుంచి అక్రమంగా ఎక్కువ పాలుపిండేందుకు ఉపయోగించే నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచి, డైరీ ఫారం యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి 173 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లను మొత్తం 43.250 లీటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్తేని కృష్ణకు గుజరాత్ నుంచి నిషేధిత ఇంజెక్షన్లను సరఫరా చేసే ఖాలెద్ అలీ అలియాస్ చత్రుసింగ్తో పరిచయం ఏర్పడింది.
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను కృష్ణకు కేవలం రూ.50కే సరఫరా చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో అత్తేని కృష్ణ వాటిని తీసుకుని స్థానిక డైరీఫారమ్ నిర్వాహకులకు ఒక బాటిల్ రూ.250 నుంచి రూ. 300 చొప్పున అమ్మాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో పరారీలో ఉన్న ప్రధాన సరఫరాదారు చత్రుసింగ్ గుజరాత్ నుంచి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను భారీ మొత్తంలో దిగుమతి చేసుకుని కృష్ణతో పాటు పలువురు డైరీఫారమ్ నిర్వాహకులకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను అమ్ముతున్న కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.