సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ): గ్రేటర్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటుకు జూన్ 1 నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేండ్ల కిందటనే కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, స్కూళ్ల ఏర్పాటుకు అప్పట్నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. కారణం ఎకరం స్థలంలో స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించడం ఇప్పుడు అసలైన సవాల్‌గా ఏర్పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఎకరం స్థలం అంటే కోట్ల రూపాయల్లో మాట. లీజుకు తీసుకోవాలనుకున్న కోటి దాటుతుంది. ఇక పెద్ద వాహనాలకు శిక్షణ అంటే రెండెకరాల స్థలం ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ జిల్లాలో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కత్తి మీద సాములాంటిదేనని నిపుణులు చెబుతున్నారు. రవాణా శాఖ ఇప్పటికే దరఖాస్తు చేసుకోవాలని సూచించినా, ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేష్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్నాక కమిషనర్ కార్యాలయం పరిశీలించి నిబంధనల ప్రకారం, అనుమతుల ఇస్తుందని ఆయన తెలిపారు. కానీ, ఇప్పటికీ ఎవ్వరూ ముందుకు రావడం లేదని చెప్పారు.
సాధారణంగా డ్రైవింగ్ లైసెన్సు కావాలంటే ఏం చేస్తాం?! ముందుగా ఒక ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి శిక్షణ తీసుకుంటాం. ఆపై మరికొన్ని రోజులు సొంత వాహనాలతో కుస్తీ పడతాం. ఆ తర్వాత పూర్తిస్థాయి నమ్మకం వస్తే డ్రైవింగ్ లైసెన్సుపై దృష్టి సారిస్తాం. అప్పటికే లెర్నింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకొని ఉంటే, స్లాట్ బుక్ చేసుకొని డ్రైవింగ్ పరీక్షకు వెళతాం. లేకపోతే లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసిన తర్వాత డ్రైవింగ్ పరీక్షకు సిద్ధపడతాం. మరి… రవాణా శాఖ ఏర్పాటు చేసే టెస్టింగ్ ట్రాక్‌లపై వాహనాన్ని నడిపి.., ఒకవేళ విఫలమైతే మరోసారి పకడ్బందీగా నేర్చుకొని మళ్లీ వెళతాం. ఇదీ… ఇప్పటివరకు డ్రైవింగ్ లెసెన్సు పొందే విధానం.
సాధారణంగా ఇప్పటి వరకు ఉన్న డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో అత్యధిక భాగం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించకుండానే శిక్షణ కాలాన్ని పూర్తి చేస్తున్నారు. మొదటి రోజు నుంచే నేరుగా స్టీరింగ్ ఇవ్వడం.., రద్దీ ఉన్న రహదారులపై తిప్పడం ఇప్పుడున్న ప్రైవేటు కేంద్రాల విధానంగా ఉంది. పైగా రోజుకు గంట, గంటన్నర మాత్రమే సమయాన్ని కేటాయించి, పది, పదిహేను రోజుల్లోనే శిక్షణ పూర్తి చేస్తున్నారు. ఇందుకు రూ.3-5 వేల వరకు వసూలు చేస్తారు. దీంతో చాలామంది వీటిని ఆశ్రయించి, కేవలం పది, పదిహేను రోజుల్లోనే సొంతంగా వాహనాలను నడుపుతున్నారు. ఇలా నాణ్యమైన శిక్షణ లేకపోవడం ఒకవంతైతే.., ఎక్కడా కూడా ట్రాఫిక్ నిబంధనలు, వాటిపై అవగాహన అనేది కనిపించదు. ఈ క్రమంలోనే చాలా రోడ్డు ప్రమాదాలకు నాణ్యమైన శిక్షణ లేకపోవడమే కారణంగా వెల్లడవుతుంది.
సాధారణంగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో అధునాతన సౌకర్యాలతో నాణ్యమైన శిక్షణ లభించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. శిక్షణలో భాగంగా తొలుత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన (థియరీ) కల్పిస్తారు. ఆ తర్వాత ఇండోర్‌లో సిమిలేటర్స్ ఇచ్చి స్టీరింగ్ నిర్వహణ, మార్జిన్ ఎలా ఉండాలనేది నేర్పిస్తారు. అనంతరమే వాహనాల స్టీరింగ్‌ను ఇచ్చి ట్రాక్‌లపై డ్రైవింగ్ శిక్షణ మొదలవుతుంది. ట్రాక్ నిర్మాణం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా పెయింటింగ్ వేయనున్నారు. ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్సు పరీక్షకు వెళ్లినపుడు వాహనాన్ని నడిపే యూ, ఎస్, ఎనిమిది తదితర ఆకారంలో ఉండే ట్రాక్‌లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా డ్రైవింగ్‌తో పాటు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన వస్తుంది. దీంతో ఇక ప్రత్యేకంగా ఆర్టీఏ కార్యాలయాల పరిధిలోని డ్రైవింగ్ ట్రాక్‌లకు వెళ్లే పరీక్షలు లేకుండానే నేరుగా డ్రైవింగ్ లైసెన్సు జారీ చేయనున్నారు.