కొండాపూర్, అక్టోబర్ 18 : ఓ ఐపీఎస్ అధికారి స్నేహితుడు తన అనుచరులతో కలిసి రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ ల్యాంకోహిల్స్‌లో సెక్యూరిటీ సిబ్బందిపై దాడులకు పాల్పడుతూ హంగామా సృష్టించారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ హఠాత్పరిణామానికి నిరసనగా సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో మొత్తం 15మందిని గుర్తించి అందులో 10మందికి నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వాహనంలో వచ్చిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
ఈఘటనతో ఐపీఎస్ అధికారికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం… ఖాజాగూడ, ల్యాంకోహిల్స్‌లోని బ్లాక్ 3 ఎల్హెచ్లో మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ తల్లి నివాసం ఉంటోంది. వీరి ఫ్లాట్ పక్కనే 1703 ఫ్లాట్‌లో ఐపీఎస్ అధికారి స్నేహితుడైన మురళి నివాసం ఉంటాడు. అధికారి ఉద్యోగరీత్య మహారాష్ట్రలో ఉండటంతో అతడి తల్లికి పక్క ఫ్లాట్‌లో ఉండే మురళి చేదోడువాదోడుగా ఉంటాడు. ఇదిలా ఉండగా ఈ నెల 15న అత్యవసర పని నిమిత్తం మురళిని తీసుకెళ్లేందుకు అతడి స్నేహితుడు వినాయకరెడ్డి ల్యాంకోహిల్స్‌కు వచ్చాడు. అయితే విజిటర్స్ పాస్ చూపించాలని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కోరడంతో వినాయకరెడ్డి తన స్నేహితుడైన మురళితో మాట్లాడించాడు.
అయితే పాస్ పంపాలని సెక్యూరిటీ కోరడంతో ‘తానే స్వయంగా చెబుతున్నాను కదా అతడిని లోనికి అనుమతించండి’ అని మురళి అక్కడి సెక్యూరిటీకి విజ్ఞప్తి చేశారు. అయినా సెక్యూరిటీ అనుమతించకపోవడంతో మురళి అక్కడికి వచ్చి, సెక్యూరిటీ సిబ్బంది బాలక్రిష్ణను నిలదీశాడు. తన ఫోన్ ప్రాబ్లమ్ ఉన్నందున తానే స్వయంగా వేరే ఫోన్‌తో మాట్లాడానని, అయినా ఎందుకు అనుమతించలేదని అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి, సెక్యూరిటీ బాలకృష్ణ ఫ్లాట్ యజమాని మురళిని నెట్టివేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన మురళి.. బాలక్రిష్ణ మీద చేయి చేసుకోగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
అయితే అప్పటికే తాను అత్యవసర పనిమీద బయటకు వెళ్లాల్సి ఉండటంతో మురళి అక్కడి నుంచి వెళ్లిపోయి, 15మంది అనుచరులతో కలిసి మూడు కార్లలో రాత్రికి తిరిగి వచ్చాడు. వచ్చీరాగానే తనను నెట్టేసిన సెక్యూరిటీ సిబ్బంది బాలక్రిష్ణ, చందులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దాడికి నిరసనగా సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ల్యాంకోహిల్స్ ముందు ధర్నాకు దిగారు. ఐపీఎస్ అధికారి అండ చూసుకునే అతడి స్నేహితుడు మురళి తన అనుచరులతో దాడికి పాల్పడ్డాడని, వెంటనే నిందితుడిని, అతడి అనుచరులను అరెస్టు చేయాలని సెక్యూరిటీ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను శాంతింపచేసి, కేసు నమోదు చేశారు.
ఐదుగురి అరెస్ట్
ల్యాంకోహిల్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటనపై కేసు నుమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించి మొత్తం 15మందిని గుర్తించి వారిలో 10మందికి నోటీసులు జారీచేశామని, చట్టవిరుద్ధంగా పోలీసు వాహనంలో వచ్చి, దాడులకు పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. ఈ ఘటనలో ఐపీఎస్ అధికారి పాత్ర ఏమాత్రం లేదని, ఘటనలో అధికారి స్నేహితుడు ఉండటం వల్ల ఆయనపై దుష్ప్రచారం జరిగినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న వివరించారు.