మల్కాజిగిరి: ప్రయాణికుల సౌకర్యం కోసం నేరేడ్మెట్ రైల్వే గేటు వద్ద ఆర్యూబీని నిర్మించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఎర్రమంజిల్‌లోని చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో నేరేడ్మెట్ వద్ద ఆర్యూబీని నిర్మించాలని కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మధుసూదన్‌రెడ్డికి ఎమ్మెల్యే, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2014 డిసెంబర్ 3న రూ.32.5 కోట్లతో ఆర్యూబీ నిర్మించడానికి శంకుస్థాపన చేశారని, పదేండ్లు అయినా పనులు మొదలు కాలేదన్నారు. తరచూ గూడ్స్ రైళ్లు, ఎంఎంటీఎస్ రెండో దశలో లోకల్ రైళ్లు నడుస్తుండడంతో తరచూ నేరేడ్మెట్ రైల్వే గేటు మూసి వేస్తున్నారన్నారు.
ప్రతి 20 నిమిషాలకు గేటు మూయడంతో ద్విచక్ర వాహనాలు, బస్సులు, కార్లు, లోకల్ లారీలు నిలిచి ట్రాఫిక్ జామ్ అవుతున్నదన్నారు. ఉద్యోగులు సమయానికి వెళ్లలేక వారి ఉద్యోగాలు ఊడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే దాదాపుగా రైల్వే శాఖ ఆర్యూబీ నిర్మాణానికి ఆమోదం తెలిపిందన్నారు. రోడ్లకు సంబంధించిన విస్తరణతో పాటు ఇతర సాంకేతిక పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కోరారు. బద్దం పరశురాంరెడ్డి, మేకల రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.