సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల కార్యకలాపాలకు ఇకపై ఆర్టీఓలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. ఎటువంటి అనాధికార వ్యక్తులు కార్యాలయాల్లో పనులు చక్కబెట్టే విధానంపై కఠిన చర్యలు ఉండనున్నాయి.. జూన్ 24న ‘ఏజెంట్లదే రాజ్యం-అధికారుల కొర్రీలు.. ఏజెంట్ల పరిష్కారాలు’ శీర్శికన ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ఇబ్రహీంపట్నం, మేడ్చల్, బండ్లగూడ, నాగోల్, మణికొండ, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరిగిన తర్వాత కూడా ఏజెంట్ల ఆగడాలు ఆగలేదని కథనంలో పేర్కొంది.
అందులో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ శనివారం ఇబ్రహీంపట్నం ఆర్టీఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పలు దస్ర్తాలు, సేవల్లో జాప్యం, లైసెన్స్ జారీ ప్రకియపై ఆరా తీశారు. లైసెన్స్ జారీ ప్రక్రియలో ఏజెంట్ల చొరవ జేటీసీ దృష్టికి రావడంతో అధికారులపై సీరియస్ అయ్యారు. కార్యాలయాల్లో అనధికార వ్యక్తుల కార్యకలాపాలకు సంబంధిత కార్యాలయ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సేవల పట్టికను కౌంటర్లు, ప్రధాన ద్వారాల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏజెంట్లను అనుమతించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం జేటీసీ మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రస్తుత ప్రమాణాలు రహదారి భద్రతకు తగినంతగా ఉన్నాయా అని అంచనా వేసి, డ్రైవింగ్ పరీక్ష మరింత కఠినంగా, సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కేవలం ఒక పత్రం మాత్రమే కాదు. అది రహదారిపై వాహనం నడపడానికి ఇచ్చే అనుమతి.. నిర్లక్ష్యంగా నిర్వహించే పరీక్షలు నేరుగా రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయి… నిజంగా నైపుణ్యం కలిగిన వాహనదారులకు మాత్రమే లైసెన్స్ జారీ చేయాలి.. అని అన్నారు.
ఈ సందర్భంగా జేటీసీ దరఖాస్తుదారులతో , సాధారణ ప్రజలతో నేరుగా మాట్లాడారు. ప్రజలకు అందుతున్న సర్వీసెస్, వేచి ఉండే సమయం, సిబ్బంది వ్యవహారం, ఆన్లైన్ పోర్టల్ వినియోగంపై అభిప్రాయాలు సేకరించారు. ప్రతి దరఖాస్తుదారుని మర్యాదగా చూడాలని, నిర్దేశిత గడువులోపు దరఖాస్తులు పరిషరించాలని సిబ్బందికి సూచించారు. వాహనదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వాహన్ పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితిని వివరంగా సమీక్షించారు. ఆర్టీఓ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.