గోల్నాక, ఏప్రిల్ 9: విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తున్న పారిశుధ్య కార్మికురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసారాంబాగ్ సిరిపిరం కాలనీకి చెందిన పుష్ప(50) అంబర్పేట అలీకేఫ్ దుర్గానర్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పారిశుధ్య పర్యవేక్షకుడికి ఫొటోతో పాటు హాజరు వేయించుకొని విధులు ముగించుకున్నది.
అదే సమయంలో ఇంటికి వెళ్లేందుకు అలీకేఫ్ చౌరస్తాలోని బస్సు స్టాపునకు నడుచుకుంటూ వెళ్తుండగా.. దిల్సుఖ్నగర్ డిపోకు చెందినఆర్టీసీ బస్సు అంబర్పేట నుంచి గోల్నాక వైపు వేగంగా మలుగుతున్న క్రమంలో పుష్పను ముందు నుంచి ఢీ కొంది. బస్సు చక్రం పుష్ప మీద నుంచి వెళ్లండతో తీవ్రగాయాలతో పాటు తల భాగం నుజ్జునుజ్జు కావడంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.