సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ఇతర రాష్ర్టాల వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. వాహన పన్నులు ఎగవేసి ఇష్టానుసారంగా ఇక్కడ తిష్టవేసిన వాహనాలు వేలల్లో ఉన్నాయనే ఫిర్యాదులు అందడంతో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలకు సిద్ధమైంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ల్లో ఇతర రాష్ర్టాల వాహనాలు అత్యధికంగా సంచరిస్తున్నాయి. అధికారులు జరిపిన తనిఖీల్లో 60కి పైగా వాహనాలు ఆర్టీఏ అధికారులకు పట్టుబడ్డాయి. దీంతో ప్రత్యేక డ్రైవ్ చేయాలని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లతో బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని కొన్ని కంపెనీల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన వాళ్లు కీలకంగా ఉండటంతో వాళ్లంతా తమ రాష్ర్టాలకు చెందిన వాహనాలను ఇక్కడ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేసింది.
ఇవీ నిబంధనలు
చాలా వరకు ఇతర రాష్టా్రల్ల్రో రిజిస్టేష్రన్ అయిన వాహనాలను నగరంలో తిప్పుతున్నారు. సాధారణంగా రూ. 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య విలువజేసే ఫోర్ వీలర్ వాహనం అయితే దాని ఖరీదుపై 14 శాతం లైఫ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇతర రాష్ర్టాల్లో రిజిస్టేష్రన్ పూర్తయి టాక్స్ చెల్లించి.. రెండేండ్లు గడిస్తే.. ఆ వాహనం తెలంగాణలో నడపాలంటే ఖచ్చితంగా ఇక్కడి నిబంధనల ప్రకారం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ రెండేండ్ల పన్నుని మినహాయించి మిగత పన్నును వసూలు చేస్తారు. సదరు యజమాని అక్కడ చెల్లించిన సొమ్మును అక్కడి ఆర్టీఏకు దరఖాస్తు పెట్టుకుని తిరిగి తన ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఉదాహరణకు ముంబైలో రూ. 9 కోట్ల విలువజేసే కారును కొనుగోలు చేస్తే.. ఆ వాహనాన్ని తెలంగాణలో నడపాలనుకుంటే 14 శాతం టాక్స్ అనగా, సుమారు కోటి 26 లక్షలు పన్ను చెల్లించాలి.
ఒకవేళ చెల్లించకుండా కాలయాపన చేస్తే ఇన్వాయిస్ ఆధారంగా మళ్లీ లైఫ్ టాక్స్‌పై నెలకు 1 లేదా 2 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వాహన యజమాని నేరుగా పన్ను చెల్లిస్తే కారు ఖరీదు ఆధారంగా 1 శాతం పెనాల్టీ లేదా అధికారుల తనిఖీల్లో పట్టుబడితే చెక్ రిపోర్ట్ ఆధారంగా 2 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన అనంతరం జరిగే ప్రక్రియతో ఇక్కడి నెంబర్‌ప్లేట్ జారీ అవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఆర్టీఏ అధికారులు వాహనాలను సీజ్ చేస్తారు. అంతేకాదు అనుమతి లేకుండా వాహనాలను నడిపి ఏదైన రోడ్డు ప్రమాదానికి పాల్పడితే అలాంటి సంఘటనల్లో మరింత కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు సీజ్
-సి.రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్.
ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నాం. పన్ను ఎగవేసి నిబంధనలు అతిక్రమించిన వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తాం. వాహనాలు సీజ్ చేస్తాం. ఆర్టీఏ నిబంధనలు అందరూ పాటించాలి. నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.