RTA | సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డులు గుట్టలుగా పేరుకుపోయాయి. వాహనదారులకు అందాల్సిన కార్డులు రెండు, మూడు నెలలు గడుస్తున్నా అందడం లేదు. తమ కార్డు ఎప్పుడొస్తుందోనని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు ఆ కార్డులను చిరునామాలకు చేర్చాల్సి ఉన్నా.. చేర్చకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేందని అధికారులను అడిగితే కార్డు ప్రాసెసింగ్‌లో ఉందని.. పూర్తయ్యాక ఇంటికి వస్తుందని చెబుతున్నారు. కానీ అసలు విషయం పోస్టల్ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో పోస్టల్ శాఖ తమ సేవలను నిలిపివేసింది.
‘ముందు బిల్లులు క్లియర్ చేసుకోండి.. అంతవరకు పోస్టల్ సేవలు’ అందవని రవాణా శాఖకు తేల్చి చెప్పింది. ఆర్సీ, లైసెన్స్ తదిరత రిజిస్ట్రేషన్ కార్డులన్నీ వినియోగదారుల చిరునామాకు చేర్చేది పోస్టల్ శాఖనే. దీంతో రవాణా అధికారులు సైతం మిన్నకుండిపోయారు. ప్రభుత్వం నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఏజెంట్ల రాజ్యం కొలువుదీరింది. కార్డు కావాలంటే వెయ్యి నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. కొందరి అధికారుల వీరికి అండగా ఉండటంతో వాళ్లు చెప్పిన రేటే ఫైనల్ అయిపోతున్నది.
అడ్డదారిలో వెంటనే..
గ్రేటర్లో 12 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో అధికంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యాలయాల్లో స్మార్టు కార్డులు పేరుకుపోయాయి. ఇప్పటికే 17వేల కార్డులు కార్యాలయాల్లోనే ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఒక్క రోజుకు రిజిస్ట్రేషన్ల కోసం ఒక్క కార్యాలయానికి 80 నుంచి 200 వరకు వాహనాలు వస్తుంటాయి. కార్డులన్నీ 7-10 రోజుల్లోపు ఇంటికి చేరాల్సి ఉంటుంది. వాహనదారులు ప్రతీ రోజు కార్యాలయాల చుట్టూ తమ కార్డుల కోసం తిరుగుతున్నారు. కొందరు ఏజెంట్లను సంప్రదించి వారడిగినంత ముట్టజెప్పి కార్డులను తీసుకుంటున్నారు. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ ప్రధాన కార్యాలయంలో ఏజెంట్లు ఆడింది ఆట పాడిందే పాటగా చెలరేగిపోతున్నారు. వారి చర్యలకు బ్రేకులు వేయాల్సిన అధికారులు సైతం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాల్లో సేవలు పారదర్శకంగా అందకపోవడంతో వాహనదారులు ఇటీవల ఏజెంట్లను ఆశ్రయించడం పెరిగింది. కార్యాలయ పనివేళల్లో ఏజెంట్లు నేరుగా కార్యాలయాల్లోకి వెళ్లి ఫైళ్లు సిబ్బంది ముందు పెట్టి పనులు చేయించుకుంటున్న సంఘటనలు ఉన్నాయి.
అధికారుల అండదండలతో..
మేడ్చల్ ప్రధాన కార్యాలయం, రంగారెడ్డిల్లోని మణికొండ, కొండాపూర్, ఇబ్రహీంపట్నం కార్యాలయాల్లో ఏజెంట్లు పేట్రేగిపోతున్నారు. ప్రత్యామ్నాయ ఆర్టీఓలుగా వ్యవహరిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సేవలు సకాలంలో అందాలన్నా.. కార్డులు వెంటనే పొందాలన్నా వాళ్లు నిశ్చయించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రమోద్ అనే వ్యక్తి రంగారెడ్డి మణికొండ కార్యాలయంలో తన వాహనం రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు నెలలకు పైగా అయింది. ఆర్సీ ఇంటికి చేరలేదు. అధికారులు కార్డు ప్రాసెస్‌లో ఉందని బుకాయించారు. ప్రమీల తనకు 2 నెలలు గడుస్తున్నా కార్డు అందలేదు. ఏజెంట్లను ఆశ్రయించడంతో వాళ్లడిగిన డబ్బులు ముట్టజెప్పి అదే రోజు కార్డు పొందారు. ఇక చేసేదేమిలేక వాహనదారులందరూ ఏజెంట్లను ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. ఈ కార్యాలయాల్లో ఓ వైపు అధికారులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఉన్నా.. ఏజెంట్లు అదే కార్యాలయంలో మరో వైపు ప్రత్యామ్నాయ వేదికలు ఏర్పాటు చేసుకొని మరీ వాహనదారులకు సేవలందించడం విశేషం.