సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వివిధ యూనివర్సిటీలకు చెందిన డిగ్రీ, పీజీ ఇతర విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీవి ముద్రిస్తూ వాటిని విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. శంషాబాద్‌లో నివాసముండే నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన చింతకాయల వెంకటేశ్వర్లు 2013 నుంచి 2017 వరకు విజ్ఞాన్ జూనియర్ కాలేజీ, బాలాజీ డిగ్రీ కాలేజీల పేరుతో హిమాయత్‌నగర్, మొయినాబాద్‌లో కరస్పాండెంట్ కాలేజీలు నిర్వహించి, వివిధ కారణాలతో వాటిని మూసివేశాడు. ఇదిలా ఉండగా.. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ ప్రస్తుతం చింతల్లో నివాసముండే వరంగల్ జిల్లా నర్సంపేట్‌కు చెందిన ఆకుల రవి అవినాశ్ అలియాస్ అజయ్‌తో ఇటీవల వెంకటేశ్వర్లుకు పరిచయం ఏర్పడింది.
తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఇద్దరు కలిసి దందా మొదలు పెట్టారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక్కో సర్టిఫికెట్‌ను మూడు నుంచి మూడున్నర లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఈ దందాకు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన కొండ్రి నవీన్ కుమార్, రాజేంద్రనగర్‌కు చెందిన గండికోట జ్యోతిరెడ్డిని మధ్యవర్తులుగా నియమించుకున్నారు. చెంగిచెర్లకు చెందిన గోపినిగారి వైశాలి బీకాం సర్టిఫికెట్ కొని, ఆమె కూడా మధ్యవర్తిగా మారింది. మీర్‌పేటకు చెందిన పెద్దుకోట్ల అభిలాశ్ కుమార్ స్ఫూర్తి కాలేజీలో బీటెక్ చదివి మధ్యలో మానేశాడు.
ఆ తర్వాత కొత్తపేట అరబిందో కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ఫెయిల్ అయ్యాడు. అయితే, విదేశాలకు వెళ్లాలనే కోరికతో 2022, నవంబర్‌లో వెంకటేశ్వర్లును సంప్రదించి రూ. 3.3 లక్షలకు నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఇలా కల్యాన్, విజయ్‌కుమార్ లాంటి సుమారు 100 మందికి పైగా నకిలీ సర్టిఫికేట్లు విక్రయించారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారిలో కొందరు విదేశాల్లో ఉండగా.. మరికొందరు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వీరి వివరాలను సేకరిస్తున్నట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడైన అవినాశ్‌పై వరంగల్‌లో హిస్టరీ షీట్ ఉండటమే కాకుండా పలు కేసులు కూడా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారంతో అవినాశ్, వెంకటేశ్‌తో పాటు నవీన్, జ్యోతిరెడ్డి, వైశాలి, అభిలాష్, కల్యాణ్, విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, పలు నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.