Old City | చార్మినార్, ఫిబ్రవరి14 : పాతబస్తీలో నిఘా వ్యవస్థ గాఢ నిద్రలోకి జారుకుంటుంది. పాత నేరస్తులపై నిఘాలు కొనసాగించాల్సిన పోలీసులు తూతూ మంత్రపు చర్యలతో మమ అనిపిస్తున్నారు. దీంతో పాత నగరంలో నేరస్తుల ఆగడాలు శృతి మీరుతున్నాయి. నిత్యం ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెబుతున్న పోలీసులు.. రౌడీల ఆగడాలను మాత్రం నియంత్రించలేకపోతున్నారు.
దారి దోపిడీలకు పాల్పడుతున్న రౌడీలు
రౌడీ మూకలు తమ ఆకతాయి చేష్టలను నిర్భీతిగా కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ తప్పడంతో రౌడీలు ఇష్టానుసారంగా పెట్రేగిపోతున్నారు. రాత్రి 11 దాటిందంటే చాలు ఎక్కడ ఏ వైపు నుండి రౌడీ మూకల గ్యాంగ్‌లు రోడ్లపైకి వచ్చి ఒంటరిగా వెళుతున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఉన్నారనే ధైర్యం క్రమేనా ప్రజల్లో సన్నగిల్లుతుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో రౌడీల ఆగడాలకు అడ్డుకట్ట లేకపోతుంది. పాత నగరంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా కొరవడడంతో వారి చేష్టలు శ్రుతి మీరుతున్నాయి.
నగరంలో ఉపాధి కోసం వచ్చిన ఓ యువకుడు ఓలా రైడర్‌గా పనిచేస్తూ ఈది బజార్లో నివసిస్తున్నాడు. తన విధులు ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆ యువకుడు డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగుల్లా సమీపంలోకి రాగానే స్థానిక రౌడీషీటర్ తన అనుచరులతో అడ్డగించాడు. బాధితుని వద్దనుండి ఏటీఎం కార్డు లాక్కొని రూ. 3 వేల నగదును డ్రా చేసుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను సైతం తస్కరించి పారిపోయారు.
నేరస్తులపై నిఘా ఎక్కడ..?
నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై తిరుగుతున్న నేరస్తుల కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు తమ పర్యవేక్షణ కొనసాగించాలి. కానీ అనేక కేసుల్లో పోలీసుల నిఘా కొరవడడం నేరస్తులకు వరంగా మారింది. దీంతో క్షేత్రస్థాయిలో పాత నేరస్తుల కదిలికలపై పోలీసులు దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అదునుగా రౌడీమూకల ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి వివరాలు నమోదు చేసుకుని పనిలో బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో రౌడీలపై నిఘా కొరవడినట్లు సమాచారం.
అడ్డుకట్ట వేస్తాం : మలక్‌పేట్ డివిజన్ ఏసిపి
రౌడీ మూకల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని మలక్‌పేట్ డివిజన్ ఏసిపి శ్యాంసుందర్ తెలిపారు. కొన్ని ఘటనలు జరిగిన వాటిపై క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్ష కొనసాగిస్తున్నాం. తదుపరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.