దాడులు.. ప్రతి దాడులతో బాలాపూర్ ప్రాంతం దద్దరిల్లుతున్నది. తుపాకులు, కత్తులతో రౌడీషీటర్లు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. తాజాగా రియాజ్ అనే రౌడీషీటర్‌పై ప్రత్యర్థులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చిన ఘటన సంచలనం సృష్టించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో బాలాపూర్, పహాడీషరీఫ్ ప్రాంతాలు రౌడీషీటర్ల హత్యలతో అట్ట్టుడికింది. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా.. తాజాగా రియాజ్ హత్యతో మరోసారి కలకలం రేగింది. ఇలా వరుస ఘటనలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతున్నారు. వారికి కౌన్సెలింగ్ సైతం ఇస్తున్నా.. తీరు మారడం లేదు. రౌడీషీటర్ల మధ్య పరస్పర దాడులు, ప్రతీకార హత్యలతో రక్తపుటేరులు పారుతున్నాయి.
– సిటీబ్యూరో/బడంగ్‌పేట, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)
Hyderabad | గ్రేటర్లో సుమారు 1950 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ఇందులో సగానికి సగం మంది రౌడీయిజానికి దూరంగా ఉన్నా.. మిగతా వారు మాత్రం వృత్తి మానడం లేదు. రౌడీయిజమే తమకు ఒక హోదాలాంటిదనే భ్రమలో తిరుగుతూ.. నేరాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు రౌడీషీటర్లు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దౌర్జన్యాలు ఎక్కువ కావడం..మరో రౌడీషీటర్ ముఠాతో గొడవలకు దిగుతుండటంతో తాడోపేడో తేల్చుకోవాలని ఇరువైపులా ముఠాలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి.
ఇందులో ఒకరు ఎత్తు వేసే వరకు.. మరొకరు దానిని గుర్తించి.. అవతలి వారినే ఖతం చేసే కుట్రలకు తెరలేపుతున్నారు. రాత్రి వేళల్లోనే రౌడీషీటర్లు తమ ముఠాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ..నేరాలకు స్కెచ్ వేస్తున్నారు. తమ ప్రత్యర్థులను ఎదుర్కొవడం కోసం కత్తులు, తుపాకులను సైతం అక్రమంగా సేకరిస్తున్నారు. ఇందుకు యూపీ, బీహార్ వంటి ప్రాంతాలకు వెళ్లి.. అక్రమంగా ఆయుధాలను సైతం సమకూర్చుకుంటున్నారు.
తాజాగా బాలాపూర్‌లో దారుణంగా హత్యకు గురైన రౌడీషీటర్ రియాజ్‌ను తుపాకులతో వెంటాడిన ప్రత్యర్థులు.. పక్కా ప్లాన్‌తోనే హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఒక రౌడీషీటర్ హత్యకు గురయ్యాడంటే.. దానికి ప్రతీకారంగా మరో హత్య జరగడం ఖాయమవుతుంటుంది. ఇందుకు రోజులు, నెలల తరబడి కూడా సమయం కోసం గ్యాంగ్‌లు ఎదురు చూస్తూ అవకాశం చిక్కగానే తమ పగను తీర్చుకుంటున్నాయి.
జనవరిలో రౌడీషీటర్ ముబారక్‌ను ఓ గ్యాంగ్ చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా హత్య చేసింది. మృతుడిపై 23 కేసులున్నాయి. గుర్రం, బైక్ కొని డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో ప్లాన్ ప్రకారం దారుణంగా హతమార్చారు. అదే నెలలో పహడీషరీఫ్ ప్రాంతంలో మయన్మార్ నుంచి శరణార్థిగా వచ్చిన ఇబ్రహీంను పాతనేరస్తులు అతి దారుణంగా చంపేశారు. సెల్‌ఫోన్ విషయంలో ఏర్పడ్డ తగాదాతో ఆసిఫ్, ఖయ్యుం అనే వ్యక్తులు ఇబ్రహీంను కత్తులతో పొడిచేశారు. తాజాగా బాలాపూర్ ప్రాంతంలో రియాజ్ దారుణంగా హత్యకు గురికావడంతో మరోసారి నగరం ఉలిక్కిపడింది.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రౌడీషీటర్ల రోజు వారీ కార్యకలాపాలపై నిఘా కొరవడింది. దీంతో యథేచ్ఛగా వారు నేరాలకు పాల్పడుతున్నారు. వారి మధ్య ఉండే ఆధిపత్య పోరుతో అప్పుడప్పుడు రక్తపుటేరులు పారుతున్నాయి. అయితే రౌడీషీటర్లు ఎక్కడున్నారు..? వారి కార్యకలాపాలపై క్షేత్ర స్థాయి పెట్రోలింగ్ పోలీసుల నిఘా ఉండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మరిచిపోయింది. రౌడీషీటర్ల మానిటరింగ్ విభాగం పూర్తిగా స్తబ్దంగా ఉన్నది. ప్రస్తుతం ఎంత మంది రౌడీషీటర్లు యాక్టివ్‌గా ఉన్నారు..? రోజు వారీ కార్యకలాపాలు ఏమిటీ..? అనే నివేదికలు కూడా ఉన్నతాధికారులు తెప్పించుకోవడం లేదు. ఇలా పోలీసుల అలస్వతం కారణంగా నగరంలో రౌడీషీటర్లు మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి.
మీర్‌పేటలో నివాసముంటున్న రియాజ్ (45) రౌడీషీటర్. ఆర్సీఐ రోడ్డు నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, అతడి కదలికలను ప్రత్యర్థులు పసిగట్టారు. అతడి ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టి..కాల్పులు జరిపారు. రియాజ్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు డీసీ సునీతారెడ్డి ఏసీపీ, లక్ష్మీకాంత్‌రెడ్డి సీఐ భూపతితో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్‌టీమ్, డాగ్ స్వాడ్‌తో తనిఖీలు చేయించారు. రియాజ్ పై రౌడీషీట్ ఉందని, బాలాపూర్ పోలీస్ స్టేషన్ తో పాటు హైదరాబాద్‌లో పలు కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు.