ఖైరతాబాద్, అక్టోబర్ 26: దేశానికి దిక్సూచిగా ఉండాల్సిన పార్లమెంట్‌ను మత రాజకీయాలకు వేదికగా మారుస్తున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కమతం యాదగిరి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, సామాజిక, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, వందేండ్ల క్రితం ఈ దేశంలో మత రాజకీయాలు ప్రజలను ప్రభావితం చేస్తాయని స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ తన వ్యాసాల్లో పేర్కొన్నారని, సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదే ధోరణి అవలంబిస్తుందని, ప్రజల మధ్య విభజన తీసుకువస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోందన్నారు. నాడు రాజ్యాంగాన్ని బలపరుస్తూ చట్టాలు చేస్తే ప్రస్తుతం రాజ్యాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరంలో మత ఘర్షణల వల్ల ఎందరో అమాయుకులు ప్రాణాలు కోల్పోయారని, మరోసారి ఈ మతోన్మాద వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతుందని, ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు వామపక్ష పార్టీలు ముందుకు రావాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ మాట్లాడుతూ, ఎంఐఎం, బీజేపీలు కలిసి మత రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ పార్లమెంట్లో పోగొట్టుకున్న సీట్లను దక్షిణ భారతదేశంలో తన రాజకీయాల ద్వారా పెంచుకోవాలని చూస్తుందని ఆరోపించారు. మత రాజకీయాల వల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదని, ప్రజల జీవన విధానాలు దెబ్బ తింటాయన్నారు. ఇలాంటి వాటిపై ప్రజలను మేల్కొలిపే బాధ్యత పౌర సమాజంపై ఉందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్ బోస్, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహా, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి కుమార్, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, అంజయ్య నాయక్, స్టాలిన్, ఉమర్ ఖాన్ పాల్గొన్నారు.