సిటీబ్యూరో, ఖైరతాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ప్రముఖ జర్నలిస్టు శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణలో మీడియా పరిణామాలు-పర్యవసానా లు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు, నేతలపై నిరాధారమైన ప్రసారాలు చేస్తూ కొన్ని మీడియా హౌస్‌లు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఆడబిడ్డలను కించపరిచేలా వార్తలను ప్రసారం చేస్తూ, సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెడుతూ జర్నలిజంపై ఉన్న గౌరవం, మర్యాదలు పోయేలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాధార వార్తలు ప్రసారం చేస్తూ వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియాలో పెడుతున్న వార్తా ఛానల్‌పై దాడి చేస్తే మాట్లాడుతున్నవారు.. గతంలో ఏబీఎన్, సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటి మీడియా సంస్థలపై దాడులు చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరైనది కాదు.. అయితే ఆ మీడియా సంస్థలు సామాజిక బాధ్యతను మరిచి ప్రసారాలు చేయడం ఎంతవరకు సబబు అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
జర్నలిస్టులు, మీడియా సంస్థలంటే తమకు అమితమైన గౌరవం ఉందని, ఎంతోమంది జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. కొన్ని మీడియా సంస్థలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతిని హేళన చేశారని మండిపడ్డారు. ఇప్పుడు అదే తెలంగాణలో బతుకుతూ.. తెలంగాణ ప్రజల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పొందుతూ తెలంగాణ ప్రజలపై ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మీడియా సంస్థలు దమ్ముంటే సరైన ఆధారాలతో వార్తలు రాయాలని, నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంపదను కొల్లగొట్టి, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర, తెలంగాణ రెండూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని.. తమను కించపరిస్తే సహించమని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు అవ్వారి భాసర్, టీయూడబ్ల్యుజే కోశాధికారి యోగి, నర్సింహరావు, అజిత, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు ఎంత స్వేచ్ఛ ఉందో.. బాధ్యత కూడా అంతే ఉందని మహా న్యూస్ యాజమాన్యం గుర్తించాలి. ఆ టీవీ ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేసినట్లు వార్తలు ప్రసారం చేస్తోంది. వార్తల పేరిట వ్యక్తిత్వ హననం చేయడం, హీరోయిన్లు, ఆడబిడ్డలను కించపరిచేలా థంబ్‌నెయిల్స్ పెట్టడం దారుణం. వారి అనుకూల పార్టీల మెప్పులు పొందడానికి మహాటీవి ఇలా ప్రవర్తిస్తోంది. టీడీపీని తెలంగాణ ప్రజలకు రుద్దే ప్రయత్నంలోనే ఇలాంటి పిచ్చి చేష్టలకు తెరతీశారు. కేటీఆర్‌పై మహా న్యూస్ అసత్య ప్రసారాలకు వ్యతిరేకంగా మాత్రమే బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.
– క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్ ఉన్నంతకాలం వాళ్ల ఆటలు సాగవనే.. వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, జానపదాలపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారు. తెలంగాణ మేధావులు, సామాజికవేత్తలు ముందుకొచ్చి ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజంపై ఇష్టానుసారంగా ప్రసారాలు చేస్తే చూ స్తూ ఊరుకోబోం. సమాజం తిరగబడకుంటే వారి వ్యక్తిత్వ హననాలు ఇలానే కొనసాగుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌పైనే అసత్య ప్రచారాలకు దిగుతారు. మహా న్యూస్ ను ఎదుర్కోకపోతే మరిన్ని ఆంధ్ర టీవీ చానళ్లు తెగబడతాయి.
– శైలేష్ రెడ్డి, సీఈవో, టీ న్యూస్
మమ్మల్ని, మా ప్రాంత నేతలు, ప్రజలను కించపరిస్తే బరాబర్ తిరగబడతాం. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర ఆగడాలు సాగిస్తే చూస్తూ ఊరుకోబోం. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా సృష్టిస్తూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తున్నారు. తెలంగాణ సాధకుడు, పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వార్తలు ప్రసారం చేయడం సిగ్గుచేటు. తెలంగాణ వ్యతిరే శక్తులన్నీ కలిసి పన్నుతున్న కుట్ర ఇది. గడిచిన పదేండ్లు వారి దాష్టీకం చెల్లలేదు.. ప్రస్తుత పాలకులు వారిచెప్పుచేతుల్లో ఉన్నందునే రెచ్చిపోతున్నారు. ఈ ప్రాంత నేతలంతా వారి బాధితులు కాకముందే జాగ్రత్తపడాలి.
– పల్లెరవికుమార్, సీనియర్ నేత
ఫోన్ ట్యాపింగ్ అంటూ ఓ అభూత కల్పన సృష్టించారు. మహాన్యూస్ ప్రసారం చేసినట్లు ఎవరూ మీడియా, పోలీసుల ముందుకు వచ్చి తమకు అన్యాయం జరిగిందని చెప్పలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు కథలు సృష్టింపకుంటున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇలాంటి ప్రేలాపణలు చేస్తున్నారు. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా బుద్ధి ఏమైంది?. మీడియాకు నైతికత ఉండాలి. కొందరు ఇకడి జర్నలిస్టులు.. ఏపీకి చెందిన ప్రముఖుల కబంధ హస్తాల్లో చికుకున్నారు. ఇలాంటి అబద్ధపు ప్రసారాలు మానుకుని జర్నలిజం విలువలను కాపాడాలి.
– ప్రసాద్, సీనియర్ జర్నలిస్టు
మీడియా స్వీయ నియంత్రణ పాటించకుండా ఎవరికి వారే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. థంబ్ నెయిల్స్ ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న మెజార్టీ మీడియా సంస్థలు ఆంధ్ర యాజామాన్యానికి సంబంధించినవే. రాష్ట్రంలోని 23 వేల మంది అక్రిడిటేషన్ కలిగిన గ్రామీణ విలేకరులు, స్టాఫ్ రిపోర్టర్లు తెలంగాణ వారే ఉంటారు. కాని చానల్స్ హెడ్స్, పెద్ద హోదాల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే ఉం టారు. ప్రధానమైన హోదాలో ఉన్న తెలంగాణవారిని కుట్ర పూరితంగానే పకన పెడుతున్నారు. ఒక హిడెన్ ఎజెండాను మీడియా సంస్థలు కొనసాగిస్తున్నాయి.
– మారుతి సాగర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి