Robotic Surgery | దుండిగల్, మార్చి 6 : హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో రోబోటిక్ సేవలను ప్రారంభించారు. ఎస్ఎస్ఐ మంత్ర 3.0 పేరిట ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ సేవలను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సతీమణి , మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఛాన్స్ లర్ కల్పనా రెడ్డి , మల్లారెడ్డి వైద్యశాలల చైర్మన్ డా. సీహెచ్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్, డా. సీహెచ్ ప్రీతి రెడ్డిలు గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. భద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి శస్త్ర చికిత్స రోబోటిక్ వ్యవస్థను తమ వైద్యశాలలో ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందని అన్నారు. రోబోటిక్ సర్జరీ ద్వారా కచ్చితత్వంతో తక్కువ సమయంలో శస్త్ర చికిత్సను పూర్తి చేయడంతో పాటు రోగి వేగంగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను ఇక్కడి ప్రజలకు అందించాలన్న సంకల్పంతోనే ముందుకు సాగుతున్నామని అన్నారు. అందులో భాగంగానే రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
డా. ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. రోబోటిక్స్ ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతుందని తెలిపారు. అత్యంత అధునాతనమైన రోబోటిక్ వ్యవస్థ ఎస్ఎస్ఐ మంత్ర 3.0 సేవలను మొట్టమొదటిసారిగా మల్లారెడ్డి నారాయణ వైద్యశాలలో ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. దీని ద్వారా వైద్య రంగంలోని సాంకేతికత వినియోగంలో తమ వైద్యశాల ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. సంక్లిష్టమైన గుండె, కిడ్నీలకు సంబంధించిన శస్త్ర చికిత్సలోఈ అధునాతన రోబోటిక్ సర్జరీ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రోగి సైతం త్వరగా కోలుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థోపెడిక్ సర్జరీలలో తాము ఈ విధానాన్ని వినియోగిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన సర్జరీ సేవలు నార్త్ హైదరాబాద్లోనే కేవలం తమ వైద్యశాలలో అందుబాటులో ఉండటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తద్వారా రోగులకు కచ్చితత్వంతో కూడిన మెరుగైన సేవలను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.