శేరిలింగంపల్లి, డిసెంబర్ 16: తాను పనిచేసిన రెస్టారెంట్ నుంచి తీసేశారని కక్షపెంచుకున్న ఓ యువకుడు మరో స్నేహితుడితో కలిసి బొమ్మ పిస్తోల్‌తో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన శుభం కుమార్ జెనా, బిశ్వజిత్ పండా యూసుప్‌గూడలో నివాసముంటున్నారు.
శుభంకుమార్ జెనా గచ్చిబౌలి నాలెడ్జిసిటీలోని టీవర్ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసి మూడు నెలల క్రితం శుభంకుమార్ జెనా పనితీరు బాగాలేదని యాజమాన్యం తీసేశారు. అదే సమయంలో బిశ్వజిత్ పండా ఉద్యోగం కూడా పోవడంతో ఇద్దరు ఖాళీగా ఉన్నారు. దీంతో టీవర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై కోపంతో రగిలిపోయిన శుభంకుమార్ బార్ అండ్ రెస్టారెంట్లో చోరీ చెయ్యాలని స్నేహితుడు బిశ్వజిత్ పండాతో కలిసి పథకం రచించాడు.
ఓ బొమ్మ పిస్తోలును కొనుగోలు చేసి ఈనెల 9న ఉదయం 6 గంటల సమయంలో శుభంకుమార్, బిశ్వజిత్ పండా ముఖాలకు ముసుగులు ధరించి సెక్యూరిటీ గార్డును బెదిరించి స్టోర్ రూంలో బంధించారు. కౌంటర్ తాళాలు తీసుకొని లాకర్లో ఉన్న రూ. 4.50 లక్షల నగదు, ఐప్యాడ్, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకొని ఉడాయించారు. రెస్టారెంట్ యజమాని శ్యామ్ అనిరుద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశాకు వెళ్తున్న శుభంకుమార్‌ను సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బిశ్వజిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.