మేడ్చల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా బోయిన్పల్లి నుంచి మెదక్ జిల్లా కాళ్లకల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ పనుల్లో భాగంగా 44వ జాతీయ రహదారి (నేషనల్ హైవే)ని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లకు విస్తరించనున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో జిల్లా వ్యాప్తంగా కోల్పోనున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను గుర్తించేందుకు రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు సంయుక్తంగా సర్వేను ప్రారంభించారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ ఆదేశాల మేరకు ఈ సర్వేను పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. మేడ్చల్ సమీపంలోని ఎల్లంపేటలో కీసర ఆర్డీవో రవి, నేషనల్ హైవే అథారిటీ పీడీ తరుణ్‌కుమార్ పర్యవేక్షణలో సర్వే ప్రారంభమైంది.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా నుంచి 25 కిలో మీటర్ల మేరకు రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. ప్రసుత్తం 30 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రోడ్డును 45 మీటర్ల విస్తీర్ణానికి పెంచనున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా ఏడున్నర మీటర్ల మేరకు విస్తరణ జరగనున్నది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల తరలింపు, తాగునీటి సరఫరా పైపులైన్లకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసే పనిలో వివిధ శాఖల అధికారులు నిమగ్నమై, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సమస్యలను జిల్లాకు సంబంధించిన ఆర్డీవోలు, తాసీల్దార్లు సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను గుర్తించిన తర్వాత నివేదికలను సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మంత్రి కేటీఆర్ ఫ్లై ఓవర్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా బోయిన్పల్లి నుంచి సుచిత్ర మీదుగా 10 కిలో మీటర్ల పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు మొదలుపెట్టారు. ఇందుకు 5 కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.446.18 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించింది. ఇందుకు రహదారి విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. ఫ్లె ఓవర్ల నిర్మాణం, బోయిన్పల్లి నుంచి కొంపల్లి వరకు ఉన్న జంక్షన్ల అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు.