Mosquitoes | సాధారణంగా దోమలు అందరికీ ఇబ్బందిని కలిగిస్తాయి. కానీ కొంతమందిని ఇవి మరీ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఎప్పుడూ వారి చుట్టూ తిరుగుతూనే వారి నుండి రక్తాన్ని పీల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కొంతమంది మాత్రమే దోమలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. దోమలు ఎందుకు ఇలా మన చుట్టూనే తిరుగుతున్నాయన్న సందేహం కూడా మనలో చాలా మందికి వస్తూనే ఉంటుంది. ఇలా కొంతమంది చుట్టూనే దోమలు ఎక్కువగా తిరగడానికి గల కారణాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు.
రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 2022లో సెల్ జర్నర్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం కొందరిలో చర్మంపై ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఆమ్లాలు ఎక్కువగా ఉన్న వారు ఆడ ఈడిస్ ఈజిప్టి దోమలను 100 రెట్లు ఎక్కువగా ఆకర్షిస్తారని వారు తెలియజేశారు. ఈ దోమలు డెంగీ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. దీనిని కనుగొనడానికి పరిశోధకులు చేతులపై నైలాన్ మేజోళ్లను ధరించి ప్రజల చర్మం నుండి సేకరించిన సహజ సువాసనను వాటిపై రాశారు. తరువాత వాటిని రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసి దోమలు ఎగురుతున్న రెండు వేర్వేరు ట్రాప్ తలుపుల వెనుక ఉంచారు. దోమలు ఎక్కువగా మ్యాటర్ 33 నుండి వచ్చిన ఒక నమూనాకు ఆకర్షించబడ్డాయని వారు కనుగొన్నారు.
మ్యాటర్ 33 నమూనాలో ఎక్కువగా కార్బాక్సిలిక్ ఆమ్లం ఉన్నట్టు వారు గుర్తించారు. చర్మ ఉద్గారాల నుండి ఎక్కువగా కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే వారు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం దోమలను ఆకర్షించే మానవ చర్మ వాసనలో ఉండే కార్బాక్సిలిక్ ఆమ్లాల స్థాయిలు, కార్బాక్సిలిక్ యాసిడ్ రిసెప్టర్లలోని జన్యు ఉత్పరివర్తనాలతో ముడిపడి ఉండడం వల్ల, ఈ సమ్మేళనాలు దోమల ఆకర్షణలో తేడాలకు కారణమవుతున్నాయని తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ రసాయనానికే దోమలు ఎందుకు ఎక్కువగా ఆకర్షితమవుతున్నాయి అనే అంశం మాత్రం అస్పష్టంగానే ఉంది.
మానన చర్మ దుర్వాసన అనేది అనేక రకాల రసాయన సమ్మేళనాల సంక్లిష్ట మిశ్రమం. వీటిలో ప్రతిదానికి దాని సొంత ప్రత్యేకమైన విశ్లేషణాత్మక గుర్తింపు ఉంటుంది. దాదాపు సంవత్సరానికి 700 మిలియన్ల మంది దోమల ద్వారా సంక్రమించే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు ఇవి మరణానికి కూడా కారణమవుతున్నాయి. కనుక దోమల నుండి మనల్ని మనం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.