బాలానగర్, ఏప్రిల్ 17 : స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వచ్చి బైక్‌పై సరదాగా వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింహరాజు తెలిపిన వివరాల ప్రకారం….సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గామానికి చెందిన చాకలి భరత్ (18), తన స్నేహితులు వినీత్ , సుభాష్‌లతో కలిసి మరో స్నేహితుడు బాబుల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు.
అనంతరం నగరంలోని చార్మినార్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలను సందర్శించి అర్థరాత్రి సమయంలో టీజీ 15 5928 నంబర్‌గల కేటీఎం బైక్‌పై ఆరుట్లకు తిరుగు ప్రయాణమై త్రిబుల్ రైడింగ్ చేస్తూ వస్తున్నారు. కాగా మధ్యలో దారి తెలియక గందరగోళానికి గురయ్యారు. వినీత్ డ్రైవింగ్ చేస్తుండగా భరత్, సుభాశ్లు వెనుక కూర్చున్నారు. బోయిన్పల్లి మీదుగా బాలానగర్ బీబీఆర్ దావఖాన వద్దకు రాగానే శుక్రవారం తెల్లవారు జామున 3.50 గంటలకు వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వినీత్, భరత్‌లను చికిత్స కోసం 108లో గాంధీ ఆస్పత్రికి, సుభాశ్‌ను కూకట్‌పల్లిలోని ఓమ్నీ దావఖానకు తరలించారు. గాంధీలో చికిత్స పొందుతున్న భరత్ మృతి చెందాడని డ్యూటీ డాక్టర్ తెలియజేశారు. భరత్ తండ్రి దుర్గేశ్ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.