మన్సూరాబాద్, జనవరి 5: శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందారు. అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. బైకు ట్యాంకు పగిలి చెలరేగిన మంటల్లో బాలుడు సజీవ దహనమయ్యాడు. హృదయ విదారకమైన ఈ ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన కుతాడి కుమార్ (40) ఆటో డ్రైవర్. హోటల్స్, హాస్టల్స్‌లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరిస్తుంటాడు. కుమార్‌కు భార్య సుగుణమ్మ, ముగ్గురు కుమారులు కుతాడి ప్రశాంత్, కుతాడి ప్రదీప్ (13), కుతాడి మదన్ ఉన్నారు. కుంట్లూరులోని రావినారాయణరెడ్డి కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఏడాదిన్నర కిందట కొందరు గుడిసెలు వేసుకున్నారు. కుమార్ కూడా గుడిసె వేసుకున్నాడు. ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో అక్కడే తమ తమ గుడిసెల్లోనే పడుకోవాలనే నిబంధనలను పెట్టుకున్నారు.
ఈ క్రమంలో కుమార్ తన భార్య సుగుణమ్మ, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కుమారుడు ప్రదీప్‌తో కలిసి గురువారం రాత్రి గుడిసెలో నిద్రించారు. సుగుణమ్మ గుడిసెలో పడుకోగా.. శుక్రవారం తెల్లవారు జామున ఉదయం 4:40 గంటల సమయంలో కుమార్ తన కుమారుడు ప్రదీప్‌ను తీసుకొని గుడిసె వద్ద నుంచి బైకుపై కుత్బుల్లాపూర్‌కు బయలుదేరాడు. పాపయ్యగూడ చౌరస్తా నుంచి కొద్దిగా ముందుకు వెళ్లగానే.. బండ్లగూడ, ఆనంద్‌నగర్ చౌరస్తా నుంచి ఓఆర్ఆర్ వైపు వెళ్తున్న టిప్పర్ అతి వేగంగా వచ్చి బైకును ఢీకొట్టింది. దీంతో టిప్పర్ కుమార్ తల పైనుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రదీప్, బైకుతో పాటు టిప్పర్ కింద పడిపోయాడు. బైకును, ప్రదీప్‌ను టిప్పర్ సుమారు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అప్పటికే బైకు పెట్రోల్ ట్యాంకు పగలడంతో పాటు.. బైకును రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగి.. బాలుడు ప్రదీప్ సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో టిప్పర్ క్యాబిన్ పూర్తిగా.. బైకు నామ రూపాలు లేకుండా కాలిపోయింది. ఈ ప్రమాదాన్ని చూసిన బాటసారులు డయల్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కుమార్, ప్రదీప్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. కుమార్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పి.యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదానికి కారణం అతి వేగమేనని పోలీసులు తెలిపారు.
తల్లడిల్లిన కుటుంబీకులు..
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కుమార్ భార్య సుగుణమ్మ ఘటనా స్థలానికి చేరుకుంది. ఒకవైపు భర్త మృతదేహం, మరోవైపు కుమారుడు సజీవ దహనం చూసి.. గుండెలు పగిలేలా రోదించింది. అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు నిర్జీవంగా పడి ఉన్న తండ్రి, కొడుకును చూసి కన్నీరు మున్నీరయ్యారు.
ప్రతిరోజు గుడిసెలో..
గుడిసెల్లో అక్కడి నివాసితులు పెట్టుకున్న నిబంధనల ప్రకారం ప్రతి రోజు కుమార్ తండ్రి రాములు పడుకునే వాడని స్థానికులు తెలిపారు. రాములు ఆరోగ్యం సరిగా లేకపోవడం.. గుడిసెలో పడుకోకపోతే మరెవరైనా ఆక్రమిస్తారనే భయంతో కుమార్ తన భార్య సుగుణ, కుమారుడు ప్రదీప్‌తో కలిసి వచ్చి నిద్రించాడు. మృత్యువు ఈ రూపంలో వచ్చిందంటూ స్థానికులు మాట్లాడుకోవడం వినిపించింది.