ప్రైవేట్ హాస్టళ్లు షట్‌డౌన్!
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో ప్రైవేటు హాస్టళ్ల మనుగడ ప్రశ్నార్థమవుతున్నది. ఒకవైపు తాగునీటి కటకట వేధిస్తుంటే.. బియ్యం ధరలు భయపెడుతున్నాయి.. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.
- పెరిగిన బియ్యం ధరలు.. నీళ్లు కరువు
- రెట్టింపవుతున్న నిర్వహణ ఖర్చులు
- ప్రతినెలా అదనంగా రూ.30-50 వేల దాకా భారం
- హాస్టళ్లు నడపడం కష్టమేనంటున్న నిర్వాహకులు
- వందల సంఖ్యలో మూతపడుతున్న వైనం
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో ప్రైవేటు హాస్టళ్ల మనుగడ ప్రశ్నార్థమవుతున్నది. ఒకవైపు తాగునీటి కటకట వేధిస్తుంటే.. బియ్యం ధరలు భయపెడుతున్నాయి.. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు వట్టిపోతుండటంతో నీటి కోసం పాట్లు తప్పడం లేదు. పైగా ప్రైవేటు ట్యాంకర్లపైనా ఆంక్షలు పెట్టడం.. వ్యాపారులు బియ్యం రేట్ల అమాంతం పెంచేయడం వెరిసి.. హాస్టళ్లు నడపడం తలకుమించిన భారంగా మారుతున్నది.
ప్రతినెలా అదనంగా రూ. 30-50 వేలకు వరకు ఖర్చు చేయాల్సి వస్తుండటంతో ప్రైవేట్ హాస్టళ్లు షట్‌డౌన్ అవుతున్నాయి. వంద సంఖ్యలో మూతపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలానే ఉంటే.. రానున్న రోజుల్లో హాస్టళ్లను నడపడం కష్టమేనంటున్నారు నిర్వాహకులు. బియ్యం ధరలు, నీటి కొరతతో సిటీలో ప్రైవేటు హాస్టళ్లు షట్‌డౌన్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): హాస్టల్ నడపడం కష్టమవుతుండటంతో వందలాది హాస్టళ్లు మూసివేసేందుకు సిద్ధమవుతున్నాయి. వర్షాలు పడకపోవడం.. సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇదే అదునుగా వ్యాపారులు బియ్యం ధరలను అమాంతం పెంచేశారు. మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి.. బోర్లన్నీ ఎండిపోతున్నాయి. జలమండలి నీళ్లు సరిపోకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.
కొద్దిరోజులుగా ప్రైవేట్ ట్యాంకర్లను కూడా ప్రభుత్వం నియంత్రించడంతో ఆ దారులు కూడా మూసుకుపోయాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు సైతం భారీగా పెరిగిపోయాయి. అన్ని సమస్యలు మూకుమ్మడిగా చుట్టుముట్టడంతో ప్రైవేట్ హాస్టళ్ల నిర్వహణపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. బియ్యం ధరలు పెరిగి, నీళ్లను ప్రైవేట్ ట్యాకర్ల ద్వారా కొనుగోలు చేస్తుండటం, నిత్యావసరాల ధరలు సైతం పెరగడంతో ప్రతినెలా రూ.30 వేల నుంచి రూ.50 వేల అదనపు భారం పడుతుందని హాస్టల్ నిర్వహకులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో వాటిని నిర్వహించడం పెనుభారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 25 వేల నుంచి 30 వేలకు పైగా ప్రైవేట్ హాస్టళ్లున్నాయి.
వీటిలో దాదాపుగా లక్ష నుంచి రెండు లక్షల మంది ఉంటున్నారు. ఇందులో విద్యార్థులు, చిరుద్యోగులతో పాటు ఐటీ కంపెనీల్లో దిగువస్థాయి ఉద్యోగాలు చేసుకుంటున్న యువత ఎక్కువగా ఉన్నారు. ఒక్కో వ్యక్తి నుంచి వసతులు, షేరింగ్‌ను బట్టి రూ.6 వేల నుంచి రూ.20 వేల దాకా వసూలు చేస్తున్నారు. గతంలో క్వింటా బియ్యం ధర రూ.5 వేల నుంచి 6 వేలు ఉంటే ఇప్పుడు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు చేరుకున్నది. సాధారణంగా వంద మంది ఉన్న హాస్టల్‌కు నెలకు బియ్యానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల దాకా ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం ధరలు అమాంతం పెరగటంతో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతున్నది.
గతేడాది భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే జలమండలి నీటితో పాటు బోరు నీళ్లు సరిపోయేవి. ప్రస్తుతం జలమండలి సరఫరా తగ్గిపోయి, బోర్లు కూడా ఎండిపోతుండటంతో వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని సమకూర్చుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరా నియంత్రించడంతో నీటి తీవ్రత మరింత పెరిగిపోయి వందలాది హాస్టళ్లను మూసివేస్తున్నారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు ఇంటిబాట పడుతున్నారు. లక్షలాది రూపాయలతో హాస్టళ్లు నడుపుతున్న యజమానులు రోడ్డున పడుతున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా వెస్ట్ సిటీలో పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది.
నెలకు రూ.30 వేలు అదనంగా..
మా హాస్టల్లో వంద మంది ఉంటున్నారు. నీటి సమస్య అంత పెద్దగా లేదు కానీ.. బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గతం కంటే బియ్యం ధరలు రెట్టింపు అయ్యాయి. దానికి తోడు కూరగాయలు, ఇతర సరకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రతినెలా బియ్యం, సరకులకు అదనంగా రూ.30 వేలు ఖర్చు అవుతుంది. హాస్టళ్లో ఉంటున్న వాళ్లకు రెంటు పెంచలేని పరిస్థితి. దీంతో వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గింది. ఎండలు వేసవిని తలపిస్తుండటంతో కరెంటు బిల్లు కూడా పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో హాస్టల్ నిర్వహించడం కష్టంగానే మారుతుంది.
– పేరం మల్లికార్జున రెడ్డి, కోకాపేట
హాస్టల్ నిర్వహణ మరింత భారం
మా హాస్టల్లో 60 మంది ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్టల్ నిర్వహణ కష్టంగానే ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి నీటి సమస్య ఎక్కువగా ఉండేది కాదు. బోరు నీళ్లు, జలమండలి సరఫరాతో సరిపోయేది. జలమండలి నీళ్లు సరిగ్గా రానప్పుడు నెలలో రెండు మూడు సార్లు ట్యాంకర్ బుక్ చేసుకునేవాళ్లం. లేదంటే ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి సర్దుబాటు చేసుకునేవాళ్లం.
కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బోరు ఎండిపోయింది. జలమండలి నీళ్లు వారానికి రెండు రోజులు వస్తున్నాయి. దీంతో మొన్నటిదాకా రూ.2 వేల చొప్పున ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా నీళ్లు కొనుగోలు చేశాం. ఇప్పుడు వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేయడంతో జలమండలి ట్యాంకర్లే దిక్కయ్యాయి. అవి కూడా బుక్ చేసుకున్నాక నాలుగైదు రోజులకు ఒకసారి వస్తున్నాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో హాస్టల్ మూసివేయాల్సిందే.
– సుంకరి యాకేష్, కొండాపూర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

