సిటీ బ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ఎండ వేడిమి పెరుగుతుండటంతో పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది. ముఖ్యంగా పారిశ్రామిక వాడలు, నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో వేడి తీవ్రత తీవ్రంగా ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు గాలిలో తేమ తగ్గిపోవడంతో పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాలు భూమి ఉపరితలంతో పాటు మిగతా ప్రాంతాల్లో విస్తరిస్తూ ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. దీంతో నగర ప్రజల్లో శ్వాసకోశ, చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.
పారిశ్రామిక వాడల్లో ఆయా కంపెనీలు వెదజల్లే కాలుష్య కారకాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎండవేడి వల్ల పెరిగిపోతున్న ధూళి కణాల ప్రభావంతో అవస్థలు పడుతున్నారు. కాలుష్య కారకాలతో పాటు ఎండ వేడి తోడవడంతో మంట, దురద వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరోవైపు ఎక్కడపడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేతల వల్ల పొగ, వేడి పెరిగిపోతున్నది. బహిరంగ ప్రదేశాల్లో దహనాలను కాలుష్య నియంత్రణ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా గాలి కాలుష్యానికి ప్రధాన కారణం అవుతున్నది. ముఖ్యంగా నగర శివార్లలో చెత్త, నిర్మాణ వ్యర్థాలను ఇష్టానుసారంగా నిర్మానుష్య ప్రాంతాల్లో కాలుస్తున్నారు. ఎండల తీవ్రత, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల దహనంతో వేడి పెరిగి నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలో పడవేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
200 పాయింట్ల చేరువలో ధూళి కణాలు..
నగర శివార్లలో భవన నిర్మాణాలు జరుగుతుండటంతో ధూళి కణాల తీవ్రత పెరిగిపోతున్నది. అటు పరిశ్రమలు కూడా శివార్లలోనే ఉండటంతో కాలుష్య తీవ్రత రెట్టింపు అవుతున్నది. ముఖ్యంగా మణికొండ, నానక్‌రాంగూడ, పటాన్చెరు, తెల్లాపూర్, అమీన్పూర్, కొండాపూర్,గచ్చిబౌలి ప్రాంతాల్లో గాలిలో పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాల స్థాయి 150 నుంచి 200 దాకా నమోదవుతున్నది. రాత్రిళ్లు దీని తీవ్రత రెట్టింపు అవుతున్నది. కొన్ని ప్రాంతాల్లో అనుమతి లేకుండా బ్లాస్టింగ్లు, క్రషింగ్లు జరుగుతుండటంతో ధూళి కణాల తీవ్రత పెరుగుతున్నది.
ఒకవైపు ఎండల వేడితో పాటు ధూళి కణాల తీవ్రత పెరిగిపోయి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వడదెబ్బ వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేడి, గాలి కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. నిర్మాణ, పారిశ్రామిక ప్రాంతాల్లో ధూళి కణాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆయా సంస్థల యజమానులు పట్టించుకోవడం లేదు. అటు అధికారులు సైతం తనిఖీలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం ముగిసేదాకా ధూళి కణాల తీవ్రత పెరగడకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని నగరవాసులు అధికారులను కోరుతున్నారు.