ఖైరతాబాద్, మార్చి 6 : ‘ఆమె’ రక్షణే తమ ధ్యేయమని, వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అన్నారు. తెలంగాణ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా రైజ్ అండ్ రన్ పేరుతో 2కే, 5కే రన్ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సాగరతీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, నగర సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు.
సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ… ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, నేరాలు జరిగినప్పుడే కాదు.. నేరాలను ముందుగానే గుర్తించి అరికట్టడంలో షీటీం సఫలీకృతమవుతున్నదన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ సురక్షితమైన నగరంగా విరాజిల్లుతున్నదన్నారు. ముఖ్యంగా మహిళలకు రక్షణగా షీటీం పనిచేస్తున్నదని చెప్పారు.
అనంతరం రన్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. రన్లో యువతులు, విద్యార్థినులు, పోలీసు అధికారులు, మహిళా సిబ్బందితో కలిసి సుమారు 5వేల మంది పాల్గొన్నారు. అంతకు ముందు నిర్వహించిన జుంబా డ్యాన్స్, ఏరోబిక్స్ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ జనరల్ (వుమెన్ సేఫ్టీ విభాగం) షికా గోయెల్, అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్) విక్రమ్‌సింగ్ మన్, క్రైమ్స్, సిట్, షీటీమ్స్, భరోసా విభాగం అదనపు సీపీ ఏఆర్శ్రీనివాస్, ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ సుధీర్ బాబు, జాయింట్ సీపీలు శిరీష, రాఘవేంద్ర, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.