సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రైస్ పుల్లింగ్ వ్యాపారంలో భారీగా సంపాదించవచ్చంటూ నమ్మించి నగరానికి చెందిన ఒక వ్యక్తిని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ సుధీంద్ర కథనం ప్రకారం.. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన పగిడిమర్రి శివ సంతోష్‌కుమార్, చిత్తూరుకు చెందిన గొల్లురు మంజునాథ్‌రెడ్డి, కర్ణాటకకు చెందిన ప్రతాప్ అలియాస్ రవీందర్ ప్రసాద్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. తమ వద్ద ఉన్న రాగి పాత్రకు విశేష శక్తులు ఉన్నాయని, దీనికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉందంటూ అమాయకులను నమ్మిస్తున్నారు. ఈ రాగి పాత్ర వద్ద బియ్యం గింజలు పెడితే.. ఆ బియ్యం గింజలను ఆ పాత్ర లాగేసే పద్ధతినే రైస్ పుల్లింగ్ అంటారు.
ఇదిలాఉండగా.. ఈ ముఠా బాధితుడైన శశికాంత్‌ను సంప్రదించి, తమ వద్ద ఉన్న రాగి పాత్ర చాలా శక్తివంతమైనదని, ఎక్కడ అమ్మినా మనకు రూ. 10 కోట్లు వస్తాయని, ముందుగా దీనిని టెస్ట్ చేయించి రిపోర్టు మన వద్ద పెట్టుకోవాలంటూ నమ్మించారు. తమది అఫ్రీంచస్ అండ్ రిసెర్చ్ కంపెనీ అని.. శివ సంతోష్‌ను అందులో పనిచేస్తున్న ఉద్యోగిగా పరిచయం చేశారు.
డీఆర్డీఓలో పాత్రను స్కానింగ్ చేయించాలని, అందుకు డీఆర్డీఓలో సైంటిస్ట్‌గా పనిచేసే ప్రతాప్ మనకు సహకరిస్తాడంటూ బాధితుడికి నచ్చజెప్పారు. వీరి మాటలు నమ్మిన బాధితుడు రూ. 25 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత డీఆర్డీఓలో పరీక్షలు పూర్తయ్యాయి.. మరో రూ. 23 లక్షలు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడికి వీరి వ్యవహారంపై అనుమానం వచ్చి.. మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.25 లక్షల నగదు, రాగి పాత్రను స్వాధీనం చేసుకున్నారు.