Heart | ఖైరతాబాద్, జనవరి 3 : ‘ఆ ఇద్దరి గుండె లయ తప్పింది.. అసాధారణ హృదయ స్పందనతో వారి జీవితం అంధకారంగా మారింది. ఒక్క అడుగు వేసినా.. ఆయాసం, ఆలసట, ఛాతీలో నొప్పితో నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నారు.. ఆ బాధితులకు నిమ్స్ వైద్యులు ఆధునిక చికిత్సతో సాంత్వన కలిగించారు. శనివారం నిమ్స్ దవాఖానలోని లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఓ. సాయి సతీశ్ వివరాలు వెల్లడించారు.
ఉప్పల్ చిలకానగర్‌కు చెందిన నిరీష (31) గృహిణి. ఏడాది మిగతా కాలంగా ఛాతీలో నొప్పి, ఆయాసంతో బాధపడుతున్నారు. గాంధీ దవాఖానలో చేరితే వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. నిమ్స్‌లో ఆధునిక చికిత్స అందుబాటులో ఉందని సూచించారు. దీంతో గతేడాది నవంబర్‌లో ఆమె నిమ్స్ వైద్యులను సంప్రదించారు. అలాగే నాగారానికి చెందిన ముదస్సిర్ (21) మటన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. గత ఐదు నెలల నుంచి గుండె దడ, నొప్పితో బాధపడుతున్నాడు. ప్రైవేట్ దవాఖానలో చూపిస్తే చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో నిమ్స్ దవాఖానను సంప్రదించాడు.
ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు
సాధారణంగా ప్రతి ఒక్కరి గుండె విద్యుత్ ప్రసరణల ద్వారా కొట్టుకుంటుంది. అందులో లోపం ఏర్పడి సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాలకే ముప్పు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అసాధారణంగా గుండెకొట్టుకోవడాన్ని వెంట్రిక్యూలర్ ప్రీమెచ్యూర్ కాంట్రాక్షన్స్ (పీవీసీ) సమస్యగా గుర్తిస్తారు. ఈ సమస్యను వైద్య పరిభాషలో వెంట్రిక్యూలర్ బైజెమినీ అంటారు. గుండె ధమనుల్లో విద్యుత్ ప్రసరణలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. దీంతో ఆసాధారణంగా గుండెకొట్టుకుంటుంది. దీంతో గుండె నుంచి ఇతర అవయవాలకు వెళ్లే రక్త సరఫరా తగ్గిపోయి ఛాతినొప్పి, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి. రోగులిద్దరికీ హోల్టర్ పరీక్ష నిర్వహిస్తే 24 గంటల్లో 48వేల సార్లు గుండె కొట్టుకుంటుంది. ఈ సమస్యతో దీర్ఘకాలికంగా బాధపడే వారికి సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ సాయి సతీశ్ తెలిపారు.
గుండెలో విద్యుత్ హెచ్చుతగ్గులను గుర్తించాలంటే..
గుండెలో విద్యుత్ హెచ్చుతగ్గులను గుర్తించాలంటే ఆధునిక త్రీడీ మ్యాపింగ్ విధానం అవలంబించాల్సి ఉంటుంది. నిమ్స్ దవాఖానలో ఈ చికిత్స అందుబాటులో ఉండడంతో రోగులిద్దరినీ పరీక్షించగా, గుండెలోని రైట్ వెంట్రిక్యూలర్ ఔట్ ఫ్లో ట్రాక్, లెఫ్ కరోనరీ కస్ప్ ప్రాంతాల్లో కచ్చిత్వంతో సమస్యను గుర్తించారు. డాక్టర్ సాయి సతీశ్ నేతృత్వంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు డాక్టర్ హేమంత్, డాక్టర్ సునీత, సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్ సాయి రామ్, డాక్టర్ దీపక్ పటేల్, సీనియర్ ఈపీ టెక్నీషియన్ ప్రమీల, నర్సింగ్ అధికారి ఫ్లోరెన్స్ల బృందం ఒక్కో రోగికి మూడు గంటల వ్యవధిలో విజయవంతంగా చికిత్సను పూర్తి చేశారు. ఇద్దరు రోగులకు త్రీడీ మ్యాపింగ్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్స విధానంతో గుండెకు అందే విద్యుత్ సరఫరాను సరిచేశామని డాక్టర్ సాయి సతీశ్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు కోలుకోవడంతో త్వరలోనే డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు.
అత్యాధునిక త్రీడీ మ్యాపింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అందుబాటులో..నిమ్స్ దవాఖానలో అత్యాధునిక త్రీడీ మ్యాపింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ విధానాలు అందుబాటులో ఉన్నాయి. గతేడాది కాలంలో 111 చికిత్సలు విజయవంతంగా నిర్వహించాం. అందులో ఆరోగ్యశ్రీలో 82, సీఎంఆర్ఎఫ్ ద్వారా 11, ఆర్టీసీ పది, ఈహెచ్ఎస్/జేహెచ్‌ఎస్‌లో 3, పేమెంట్ పద్ధతిలో ఐదుగురికీ చికిత్స అందించాం. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు వస్తుంది. కానీ నిమ్స్ దవాఖానలో ప్రభుత్వ పథకాలతో పేద రోగులకు పూర్తిగా ఉచితంగా, ఇతరులకు కేవలం రూ.1.20 లక్షలతో చికిత్స అందిస్తున్నాం. ఆయాసం, గుండెదడ, నొప్పితో బాధపడుతూ గుండె జబ్బులు ఏమైనా ఉన్నాయన్న అనుమానం కలిగితే కేవలం ఈసీజీ పరీక్షతో సమస్యను గుర్తించవచ్చు. సకాలంలో గుర్తించి వైద్య చికిత్స అందిస్తే జీవితంలో మందులే అవసరం ఉండదు.
డాక్టర్ ఓ. సాయి సతీశ్, నిమ్స్ సీనియర్ కార్డియాలజీ ప్రొఫెసర్