KTR | మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.
యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం అన్నారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, మీ ‘బడే భాయ్’ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేక పోవడం మీ చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రం పైన ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు.
ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో..
తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా.. పట్టించుకోవడం లేదన్నారు.
ఈ అంశంలో రేవంత్ రెడ్డి తన చేతగానితనానికి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఢిల్లీకి పోతే ‘చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్ని చూస్తున్నట్టుగా’ చూస్తున్నారని మీరే చెప్పుకున్నప్పుడే మీ నిజ స్వరూపం బయటపడిందని, బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పై పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేతకాదని 4 కోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని చెప్పడం అంటే, మోదీ కన్నా కేసీఆర్ పవర్ ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా అని ఎద్దేవా చేశారు.
మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ‘మినీ ఇండియా’ లాంటి హైదరాబాద్లో మీకు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కేటీఆర్ హెచ్చరించారు.