అల్లాపూర్, జనవరి 8 : ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న రీసోర్స్ పర్సన్ అనితను సస్పెండ్ చేస్తూ మూసాపేట ఉప కమిషనర్ వంశీకృష్ణ ఉత్వరులు జారీ చేశారు. బుధవారం ‘నమస్తే’లో ‘రూ.500 ఇస్తేనే.. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన’.. అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి మూసాపేట ఉపకమిషనర్ వంశీకృష్ణ స్పందించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడితే ఎంతటివారైనా కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి ఇంటింటి సిబ్బంది వెళ్లి దరఖాస్తులను పరిశీలిస్తారని, ఒక వేళ ఎవరివద్దకైనా రాని పక్షంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 100 శాతం ప్రతి దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి దరఖాస్తును పరిశీలించి, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామని తెలిపారు.దరఖాస్తులు పరిశీలిస్తున్న సిబ్బంది పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. దరఖాస్తు పరిశీలనలో సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే…సంబంధిత అధికారులకు లేదా…నేరుగా తనకే ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు ఉపకమిషనర్ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.