సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : భారత్, ఆస్ట్రేలియా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో గతంలో చేసుకున్న ఎంవోయూను పునరుద్ధరిస్తూ గురువారం ఓయూలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బర్నీ గ్లోవర్ ఏవో, డిప్యూటీ వైస్ చాన్సలర్, వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డెబోరా స్వీనీ, ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ పరస్పరం అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
సైబర్ సెక్యూరిటీ, సైకాలజీ (పాజిటివ్ సైకాలజీ, సైకో-లింగ్విస్టిక్స్), హెల్త్సైన్స్ క్యాన్సర్ రీసెర్చ్, జెనెటిక్స్, ఎంటర్ప్రెన్యూనర్ షిప్, బిజినెస్ అనలిటిక్స్, అండో-పసిఫిక్ స్టడీస్ తదితర అంశాలపై చర్చించారు. ఎంవోయూ ప్రకారం అన్ని రకాల విద్యా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తామని ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంవోయూ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ జీబీరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ శ్రీరామ్వెంకటేశ్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్యామల, ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, జన్యుసంబంధ వ్యాధుల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బి.విజయలక్ష్మి తదితర విభాగాధిపతులు పాల్గొన్నారు.