సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): తాము అనుకున్న వ్యక్తికి ఓపెన్ ఆన్లైన్ టెండర్లో కాంట్రాక్టు దక్కకపోవడంతో ఆ టెండర్‌నే రద్దు చేశారు. నిబంధనలకు అనుగుణంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ‘ఎల్1’ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి.. 20 రోజులుపాటు పెండింగ్‌లో పెట్టి, ఆ తర్వాత సాఫీగా పైఅధికారుల ఆదేశాల మేరకు అంటూ.. ఆ టెండర్‌నే రద్దు చేశారు. రద్దు చేసిన లేఖను టెండర్లో పాల్గొన్న కాంట్రాక్టర్లకు పంపించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హబ్సిగూడ సర్కిల్లోని కీసర డివిజన్లో జరిగిన టెండర్ల రద్దు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఉన్నతాధికారులు కొందరు కాంట్రాక్టర్లకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కీసర డివిజన్ పరిధిలోని కీసర ఆపరేషన్ సెక్షన్లో డీటీఆర్(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు) ఎల్టీ, హెచ్‌టీ లైన్లు, ఇతర అనుబంధ పనులు చేపట్టడం, కొత్తగా అమర్చడం.. వంటి పనులు చేపట్టేందుకు నమోదిత కాంట్రాక్టర్ల నుంచి సీల్డ్ టెండర్లను ఆన్లైన్లో జూన్ 14న పిలిచారు. అయితే, జూన్ 27వ తేదీ వరకు గడువు ఇవ్వడంతో సుమారు రూ.15 లక్షల విలువ చేసే ఈ కాంట్రాక్టు పనులను చేపట్టేందుకు అర్హులైన కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొన్నారు. ఈ టెండర్లో పాల్గొన్న వారిలో విఘ్నేశ్వర ఎలక్ట్రికల్స్, లాస్య శ్రీఎలక్ట్రికల్స్, విజయలక్ష్మి ఎలక్ట్రికల్స్, మౌనిక ఎలక్ట్రికల్స్, దుర్గాశ్రీ ప్రాజెక్టులు ఉండగా, అందులో 28శాతం లెస్తో బిడ్ దాఖలు చేసిన కూకట్‌పల్లికి చెందిన విఘ్నేశ్వర ఎలక్ట్రికల్స్ ఎల్1గా నిలిచింది. టెండర్ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట పనులను ఎల్1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థకు ఇవ్వాల్సి ఉండగా, దానిని ఆకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు హబ్సీగూడ సర్కిల్ పరిధిలోని డీఈ ఆపరేషన్స్(కీసర డివిజన్) ఉన్నతాధికారి రద్దు చేసిన ఓ లేఖను కాంట్రాక్టర్లకు పంపించారు. దీంతో ఈ విషయం సర్కిల్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. తమకు నచ్చిన కాంట్రాక్టర్ల కోసం ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంట్రాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు. టెండర్ల రద్దుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు.
హబ్సిగూడ ఎస్ఈ (సూపరింటెండెంట్)పరిధిలోని కీసర డివిజన్లో మొత్తం 7 సెక్షన్లు ఉన్నాయి. ఇందులో కీసర, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, మేడిపల్లి, పీర్జాదిగూడ, బాలాజీనగర్ సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్ల పరిధిలో టీజీఎస్పీడీసీఎల్కు సంబంధించిన పనులు నిర్వహించాలంటే గుర్తింపు పొంది, సంస్థలో నమోదైన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లకే ఎంపిక చేసిన పనులను అప్పగించాల్సి ఉంటుంది. ఇక్కడే ఉన్నతాధికారులైన ఎస్ఈ, డీఈలు, ఏడీఈలు తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కీలకం కావడంతో వారు చెప్పినట్లు వినే కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీసర డివిజన్ పరిధిలో రూ.15లక్షలతో చేపట్టే పనులకు 28 శాతం తక్కువ మొత్తంలో టెండర్ వేసిన ఎల్-1 కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించకుండా, 20 రోజుల పాటు పెండింగ్‌లో పెట్టి టెండర్ రద్దు చేయడం వెనుక చాలా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
కీసర సెక్షన్ పరిధిలో విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు నిర్వహించేందుకు జూన్ 14న టెండర్లు పిలిచాం. జూన్ 27వ తేదీ వరకు విధించిన టెండరు గడువు ముగిసిన తర్వాత తక్కువ మొత్తానికి కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్1గా ఎంపిక చేశాం. కాగా, దీనిపై హబ్సిగూడ సర్కిల్ ఎస్ఈ నుంచి అభ్యంతరాలు ఉండటంతో దానిపై స్పష్టత కోసం టెండర్‌ను రద్దు చేస్తూ జూలై 20న నిర్ణయం తీసుకున్నాం. రద్దు చేసిన టెండర్‌ను మళ్లీ పిలిచి నిబంధనల ప్రకారమే వ్యవహరించి తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తాం. ఈ టెండర్‌ను రద్దు చేయడంలో ఎలాంటి అవినీతికి ఆస్కారంలేదని కీసర డివిజన్ ఆపరేషన్స్ డీఈ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.