మణికొండ, మార్చి 19: గత కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రెడీమిక్స్ వాహనాలకు నో ఎంట్రీ నిబంధన లేకుండా పోయింది. రాత్రి 10:00 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలను రోడ్లపైకి అనుమతివ్వాలని పోలీసులు నిబంధనలను విధించారు. కానీ నార్సింగి, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెడీమిక్స్ వాహనాలతో పాటు భారీ వాహనాలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఫలితంగా పలుచోట్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడగా, మరికొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ తెలిసిన ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు ”మామూలు”గా తీసుకుంటున్నారు. ఫలితంగా వాహనచోదకులు ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ వాహనాలను నడుపుకుంటున్నారు.
నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ సర్వీస్ రోడ్డులో రెడీమిక్స్ వాహనాలు ఇష్టానుసారంగా నడుపుతున్నారు. అదేవిధంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లి ఔటర్ సర్వీస్ రోడ్డుతో పాటు క్యూసిటీ, మైక్రోసాఫ్ట్ జంక్షన్, టీ గ్రిల్ తదితర ప్రాంతాలలో రెడీమిక్స్ వాహనాలతో పాటు భారీ వాహనాలు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తున్నాయి. ఔటర్ సర్వీస్ రోడ్డుపై అతివేగంగా, అజాగ్రత్తగా మైనర్ డ్రైవర్లతో ఈ వాహనాలను నడుపుతుండడంతో ఎప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి ఖానాపూర్ గ్రామం వైపు వెళ్లే రహదారిలో గత కొన్నాళ్లుగా ఓ పంచర్ దుకాణం ఏకంగా రహదారిలోనే వాహనాలను నిలిపి పంచర్ చేస్తున్న దృశ్యాలను నిత్యం ట్రాఫిక్ పోలీసులు చూసి ”మామూలు”గా తీసుకుంటున్నారు. దీంతో ఖానాపూర్ వైపు వెళ్లాలంటే ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఈ విషయంపై గతంలో నార్సింగి ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నచిన్న ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిపై తమ ప్రతాపాన్ని చూపే ట్రాఫిక్ పోలీసులు పట్టపగలే ఔటర్ సర్వీస్ రోడ్డుపై రెడీమిక్స్ వాహనాలు కుప్పలు కుప్పలుగా తిరుగుతున్న ట్రాఫిక్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సదరు రెడీమిక్స్ ప్లాంట్ల యజమానుల వద్ద నుంచి నెలవారి వసూలు చేస్తుండడంతోనే ఆ వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా కోకాపేట మైక్రో బిల్డింగ్ ఎదురుగా ఓ నిర్మాణ రంగ సంస్థ ఏకంగా రోడ్డుపై కంటైనర్లు ఏర్పాటు చేసుకుని నిర్మాణాలు చేస్తుంటే ట్రాఫిక్ అధికారులు అటుగా చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతంలో వాహనాలు వెళ్తుంటే ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని వాహన చోదకులు అంటున్నారు. కేవలం ప్రధాన జంక్షన్ ల వద్ద సాయంత్రం వేళ సాఫీగా సాగుతున్న వాహనాల రాకపోకలను నిలుపుదల చేసి విధులు నిర్వహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ట్రాఫిక్ నిబంధనలను ఎక్కడ గాడిలో పెడుతున్నట్లు లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పట్టపగలు రెడీమిక్స్ వాహనాలు ఇష్టానుసారంగా నడుపుతున్న ట్రాఫిక్ పోలీసులు కంటి తుడుపు చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చని స్థానిక ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలను గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు పట్టపగలు కొనసాగుతున్న ట్రాఫిక్ రద్దీ అందుకు కారణమైన రెడీమిక్స్ వాహనాలపై తగు చర్యలు తీసుకొని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.