ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ లేకుంటే రెడ్ నోటీసులు
స్పందించకుంటే చట్టరీత్యా చర్యలు
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 2 ;ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణపై జీహెచ్ఎంసీ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టింది. కరోనా కారణంగా రెండేండ్లుగా ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణపై దృష్టిసారించని అధికారులు తాజాగా ఉన్నతాధికారులు ఆదేశాలతో రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా కూకట్పల్లి జంట సర్కిళ్ల అధికారులు ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. వార్డుల వారీగా బృందాలు ప్రతీ వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి ట్రేడ్ లైసెన్స్ ఉందా..? లేదా.. వివరాలను సేకరిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ ఉంటే రెన్యువల్ చేసుకున్నారా లేదా అని పరిశీలిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని గుర్తిస్తూ నోటీసులను జారీ చేస్తున్నారు. స్పందించకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 8616 ట్రేడ్ లైసెన్స్‌లు ఉన్నాయి. మూసాపేట సర్కిల్లో 4277, కూకట్పల్లి సర్కిల్లో 4339 ట్రేడ్ లైసెన్స్ లు ఉన్నాయి. వార్షిక యేడాదిలో ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ ద్వారా రూ.20.10 కోట్ల ఆదాయం జీహెచ్ఎంసీకి రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 4.55 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 15.55 కోట్ల బకాయిలు ఉన్నాయి. మూసాపేట సర్కిల్లో రూ.11.84 కోట్ల లక్ష్యానికి గాను 2.43 కోట్లు వసూళ్లు కాగా 9.41 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. కూకట్పల్లి సర్కిల్లో రూ.8.26 కోట్లకు గాను 2.12 కోట్లు వసూళ్లు కాగా 6.14 కోట్లు వసూళ్లు కావాల్సి ఉంది.
17 టీమ్‌లు..
ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం జంట సర్కిళ్లలో 17 టీమ్‌లు రంగంలోకి దిగాయి. కూకట్పల్లి సర్కిల్లో 6 వార్డులకు గాను 12 టీమ్‌లు, మూసాపేట సర్కిల్లో 5 వార్డులకు గాను 5 టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఒక్కో టీమ్‌లో ఎస్ఆర్పీ లేదా జవాన్ టీమ్ లీడర్‌గా ఎస్ఎఫ్ఏలతో కలిసి ప్రతీ వ్యాపార సముదాయం, దుకాణానికి వెళ్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయా..? లేదా అని ఆరాతీస్తున్నారు. ప్రతిరోజూ వంద దుకాణాలను పరిశీలిస్తూ నివేదికను సిద్ధం చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నోటీసులు జారీ చేస్తున్నారు. దీర్ఘకాలికంగా రెన్యువల్ చేసుకోని వారికి రెడ్ నోటీసులను జారీ చేస్తూ చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తులు..
ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసిన వారు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్మినెంట్ ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్ (టీఐఎన్) ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలతో సర్వే చేస్తున్నాం. ట్రేడ్ లైసెన్స్ ఉందా..? లేదా అనే వివరాలను తెలుసుకుంటూ తప్పనిసరిగా అందరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని కోరుతున్నాం. స్పందించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం.
– సంపత్‌కుమార్, ఏఎంహెచ్‌వో, మూసాపేట