మూలిగే నక్కపై తాటి కాయ పడినట్లుగా కాంగ్రెస్ సర్కారు చేపట్టే ప్రణాళికలు రియాల్టీ రంగానికి శరాఘాతంలా మారుతున్నాయి. సర్కారు చేపట్టిన ఈ రెండున్నరేండ్ల్ల విధ్వంసంతో ప్లాట్లను అమ్ముకోలేని పరిస్థితుల్లో.. భూముల ధరలను భారీగా పెంచి మార్కెట్‌ను సంక్షోభంలోకి నెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలను సవరించాలని చేపట్టిన కసరత్తు కొలిక్కి రావడంతో.. దీని ప్రభావం రియాల్టీకి ప్రధాన కేంద్రమైన హైదరాబాద్ నగరంపై పడనున్నది. సర్కారు చర్యలతో రానున్న రోజుల్లో మార్కెట్లో అమ్మకాలు నిలిచిపోయే ప్రమాదం ఉండగా, ఇక నేరుగా సామాన్యుడిపై పడే భారంతో సొంతింటి కలలు ఆవిరైపోయే పరిస్థితి నెలకొంది.
సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ వ్యాప్తంగా సవరించే భూముల ధరలతో ఇప్పటికే అడ్వాన్సులు చెల్లించి, రిజిస్ట్రేషన్ల కోసం చూస్తున్న వారికి అదనపు భారం కానుంది. ప్రస్తుతం సర్కారు గతంలో ఉన్న భూముల ధరను 30-50శాతానికి పెంచే యోచనలో ఉన్నది. ఇదే గనుక జరిగితే స్టాంపు డ్యూటీల రూపంలో సర్కారుకు వచ్చే ఆదాయంలో భారీగా పెరగనుంది. ముఖ్యంగా గజం లక్షలు పలికే హైదరాబాద్ కేంద్రంగా భూముల సవరణతో బడ్జెట్ అంచనాలు ఆమాంతం పెరగనున్నాయి. గతంలో 3 లక్షలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించుకునే అవకాశం ఉంటే… భూముల సవరణ తర్వాత కనీసం రూ. 4.5-5లక్షలకు పెరగనున్నది. ఈ లెక్కన సర్కారు చేయనున్న భూముల సవరణ ఏ స్థాయిలో సామాన్యుడికి భారం కానుందో తెలిసిపోతుంది. అదే విధంగా ఫ్లాట్ల చదరపు అడుగును కూడా మారనుండటంతో హైదరాబాద్‌తోపాటు, శివారు ప్రాంతాల్లో ఇండ్ల అమ్మకాలు మందగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొనుగోళ్లు ఢమాల్…
కొనుగోళ్లు మందగించే ప్రమాదం ఉంది. గడిచిన రెండేళ్లలో నగరంలో అపార్టుమెంట్ల ఫ్లాట్లకు గిరాకీ భారీగా పడిపోయింది. ఎందుకంటే హైడ్రా కూల్చివేతల తరహాలో వచ్చే పెను సంక్షోభంపై భయాందోళనలతో అమ్మకాలే లేకుండా పోయాయి. దీంతో బిల్డర్లు కూడా కొత్త ప్రాజెక్టులను చేపట్టడం కంటే ఉన్న ఫ్లాట్లను నయానో, బయానో పెట్టి అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో పెరిగిన ఇన్వెంటరీని తగ్గించుకుంటే చాలన్నట్లుగా రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమ్మకాలను ప్రభావితం చేసేలా భూముల ధరలను సవరించడం వల్ల కొత్త బుకింగ్ వచ్చే అవకాశమే లేదని కూకట్‌పల్లికి చెందిన ఓ రియల్ వ్యాపారి ఆవేదనతో వివరించారు.
ధరలు పెంచి… చార్జీలు తగ్గించాలి
కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగానికి జీవం పోసే ఉద్దేశం కాంగ్రెస్ సర్కారుకు ఉంటే సవరించనున్న భూముల ధరలకు అనుగుణంగా చార్జీలను కూడా సర్దుబాటు చేయడంపై దృష్టి పెట్టాలి. దీంతో మార్కెట్లో ఉండే కొనుగోలుదారులు, అమ్మకందారులపై ప్రభావం తక్కువగా ఉంటుంది. దాదాపు 7.5 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని 3 శాతానికి తగ్గించడం వల్ల భూముల ధర సవరించినా నేరుగా కొనుగోలుదారుడిపై పడదనీ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ వివరించారు. కానీ ఎంతసేపు రిజిస్ట్రేషన్ ధరలను పెంచడంపైనే సర్కారు దృష్టి పెడితే… అమ్మకాలు లేక ఈ రంగంపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. ఈ విషయంలో సర్కారు పునరాలోచన చేసి, ఎస్ఆర్ఓ విలువను సవరించినా… స్టాంప్ డ్యూటీలను కూడా సవరిస్తే ఇబ్బందులు ఉండవని, మార్కెట్లో కాస్తోకూస్తో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.