సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 22: ఉస్మానియా దవాఖానకు వైద్య సేవల నిమిత్తం పేదలు మాత్రమే వస్తారనే అపోహను వీడి, ఈ దవాఖానలో అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటి వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు. ఉస్మానియా దవాఖానలోని ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ ఇటీవల నిర్వహించిన అరుదైన శస్త్ర చికిత్స వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మల్లెల భాగ్యమ్మ కొడుకు రాంబాబు, కోడలు మల్లెల వాణి(31)తో నగరానికి వలస వచ్చి బోరబండలో ఉంటున్నారు. ఆరు నెలల క్రితం కోడలికి కడుపులో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ దవాఖానలో చూపించగా, లక్షలల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో వారు తమ స్వగ్రామమైన గుంటూరుకు తీసుకువెళ్ళి అక్కడి వైద్యులకు చూపించగా, సుమారు 15 లక్షలకు పైగా ఖర్చవుతుందని అన్నారు. తలకు మించిన భారం కావడంతో, తెలిసిన వారి సూచనల మేరకు జనవరి 21న ఉస్మానియా దవాఖానలో అడ్మిట్ చేశారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు పరీక్షించి కాలేయం కుడి వైపు భాగంలో రక్త నాళాలను ఆనుకొని పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇది అత్యంత క్లిష్టమైన సర్జరీగా భావించి, రోగికి అన్ని పరీక్షలను నిర్వహించిన అనంతరం, ఫిబ్రవరి 4న సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం, అనస్తీషియా విభాగం వైద్యులతో కలిసి సుమారు 8 గంటలు శ్రమించి లాప్రోస్కోపిక్ ఆర్టీ ‘హెపాటెక్టమి’ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. వైద్యుల బృందంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ సీహెచ్ మధుసూదన్, అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ పాండునాయక్, ప్రొఫెసర్ పావనిలు ఉన్నారు. ఇటువంటి క్లిష్టమైన శస్త్ర చికిత్సలను నిర్వహిస్తూ ఉస్మానియా దవాఖాన పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింప జేసినందుకు వైద్యులను సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ ప్రత్యేకంగా అభినందించారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ సీహెచ్ మధు సూదన్ మాట్లాడుతూ సాధారణంగా ఇటువంటి చికిత్సలను ఓపెన్ సర్జరీ ద్వారా చేయాల్సి ఉంటుందని, కానీ, తెలంగాణ ప్రభుత్వం అందించిన సుమారు 75 లక్షల విలువ చేసే కూసా యంత్రం సహాయంతో ల్యాప్రోస్కోపి వలన తక్కువ నొప్పి, చిన్న గాటు, ఒక్క కుట్టు లేకుండా త్వరగా రోగి కోలుకోవడానికి ఉపయోగపడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ బి.రమేశ్, డాక్టర్ పావని, డాక్టర్ జ్యోతి, డాక్టర్ మాధవి, డాక్టర్ హైఫజర్ రెహ్మాన్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ వరుణ్, డాక్టర్ వేణు, సిబ్బంది సునీత, సరళ, మాధవి, సూర్య ప్రకాష్ కృష్ణ, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.