సిటీబ్యూరో, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): నగరంలో కలకలం స్పష్టించిన గాంధీ దవాఖాన, సంతోష్‌నగర్ లైంగిక దాడి ఘటనలు కట్టుకథే అని పోలీసులు తేల్చారు. గాంధీ దవాఖానకు వచ్చి కనిపించకుండా పోయిన మరో మహిళ ఆచూకీ కూడా తెలియడంతో ఈ ఘటనపై ఉత్కంఠకు పోలీసులు తెర దింపారు. దవాఖానలో కిడ్నీ చికిత్స కోసం ఈనెల 5న మహబూనగర్కు చెందిన ఓ వ్యక్తి చేరాడు. అతడికి భార్య, మరదలు సహాయకులుగా ఉన్నారు. 11వతేదీ వరకు అందరూ కలిసే ఉన్నారు. అక్కాచెల్లెళ్లకు కల్లు తాగే అలవాటు ఉండటంతో ఆ రోజు సాయంత్రం దవాఖాన నుంచి వచ్చి కల్లు ఎక్కడ దొరుకుతుందని ఆరా తీశారు. వారికి ఎక్కడా కల్లు లభించకపోవడంతో ఒకరు బయటకు వెళ్లిపోయారు. ఆమె చెల్లెలు దవాఖాన ప్రాంగణంలోనే తిరిగింది. చికిత్స పొందుతున్న రోగి తమ వాళ్లు ఎక్కడికి వెళ్లారో అని కంగారుపడుతూ బయటకు వచ్చాడు. ఆచూకీ తెలియకపోవడంతో దవాఖానలో ఎవరికి చెప్పకుండానే వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో 15న చిలకలగూడ పోలీసులకు సదరు రోగి మరదలు తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును స్వయంగా నగర పోలీస్ కమషనర్ పర్యవేక్షించారు. టాస్క్‌ఫోర్స్, ఎస్బీ, శాంతిభద్రతలు, షీ టీమ్స్‌తో కూడిన 12 బృందాలను రంగంలోకి దింపి భిన్న కోణాల్లో దర్యాప్తు చేశారు. మరోవైపు కనిపించకుండాపోయిన రోగి భార్య కోసం గాలింపు చేపట్టారు. 800 గంటల నిడివి కలిగిన 500 సీసీ కెమెరాలను విశ్లేషించారు. డిజిటల్ డేటా, సెల్‌ఫోన్ డేటాను విశ్లేషించారు. 200 మందిని విచారించారు. మెడికల్ రిపోర్టులను సేకరించారు. సీసీ కెమెరాల్లో సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా సేకరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి లైంగిక దాడి ఘటన జరుగలేదని తేల్చారు. ల్యాబ్ టెక్నీషియన్ కూడా వాళ్లకు సహాయం చేసేందుకు ప్రయత్నించాడని విచారణలో తేలింది.
ప్రేమించిన వాడితో పెండ్లి కావడం లేదు.. అతడు దూరం పెడుతున్నాడని ముందస్తు ప్లాన్‌తోనే బాధితురాలు కథ అల్లినట్లు విచారణలో తేలింది. ప్రేమించిన వాడికి పెండ్లయ్యింది..మరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని అతడి భార్యకు తెలియడంతో బాధితురాలిని దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె రాత్రి సుమారు 9 గంటలకు తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లి తిరిగి 10.30 గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో మూడు ఆటోలు మారింది..తనను షాహిన్‌నగర్‌లో పాత బస్సులో తనపై లైంగిక దాడి చేశారంటూ.. ఫిర్యాదు చేసింది. ఆమె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఆమెను ముందుగా భరోసా కేంద్రానికి పంపించి.. మనైస్థెర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. వివరాలు సేకరించారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం సమయాన్ని అంచనా వేస్తూ, ఎక్కడెక్కడ తిరిగిందో ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటన జరిగిందని చెప్పిన ప్రాంతాన్ని సందర్శించారు. విచారణలో ఆమె చెప్పిన విషయాలకు, శాస్త్రీయంగా వచ్చిన ఆధారాలకు పొంతన లేదని గుర్తించారు. ఘటనా స్థలిలో ఎలాంటి అనవాళ్లు లభించలేదు. బాధితురాలు సెల్‌ఫోన్‌ను తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లగానే స్విచ్ఛాఫ్ చేసింది. అయితే తన సిమ్‌కార్డును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కున్నారని తెలిపింది. ఇక్కడ శాస్త్రీయంగా పోలీసులు ఆధారాలు బయటపెట్టారు. ఆమె శరీరంపై ఉన్న గాయాలు లైంగిక దాడిలో జరిగినవి కావని వైద్యులు చెప్పారు. సొంతంగా చేసుకున్నవని తేల్చారు. ముండ్లు కుచ్చుకోవడంతో గాయాలయ్యాయంటూ చెప్పినా.. ఘటనా స్థలంలో అలాంటివి ఏవీ లేవు. బాధితురాలు చెప్పిన అంశాలను, శాస్త్రీయ ఆధారాలను, మెడికల్ రిపోర్ట్సు, పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలన్నీ క్రోడికరించి సంతోష్‌నగర్‌లో ఎలాంటి లైంగిక దాడి ఘటన జరుగలేదని పోలీసులు తేల్చారు.
మహిళలకు సురక్షితమైన నగరంగా హైదరాబాద్‌కు పేరు ప్రతిష్టలున్నాయి. మహిళలపై అఘాయిత్యం జరిగిందనే ఫిర్యాదులు వస్తే ఆ కేసులను సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ తెలిపారు. ఈ రెండు ఘటనలపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి సాంకేతిక పరమైన అంశాలతో పాటు వందలాది మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి వైద్య నివేదికలతో ముందుకు వెళ్లామన్నారు. అదనపు సీపీ శిఖా గోయెల్ నేతృత్వంలో కొనసాగుతున్న భరోసా కేంద్రంలో బాధితులకు తగిన ధైర్యం చెబుతూ షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్ర బృందం ఈ దర్యాప్తులో పాల్గొన్నారని సీపీ అభినందించారు. సౌత్‌జోన్ డీసీపీ గజరావు భూపాల్, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్, టాస్క్‌ఫోర్స్ బృందాలు నాలుగైదు రోజులుగా ఈ కేసులో వాస్తవాలను బయటకు తెచ్చేందుకు నిరంతరం పనిచేశారని ప్రశంసించారు.
ఐదురోజులుగా కల్లు దొరక్కపోవడంతో బాధితురాలు మానసికంగా కుంగిపోయి…ఆ స్థితిలో తనపై లైంగికదాడి జరిగిందని కట్టుకథ అల్లినట్లు పోలీసులు గుర్తించారు. అబద్ధాన్ని నిజం చేసేందుకు మరిన్ని అబద్ధాలు అడినట్లు తేల్చారు. ఆమె అక్క సైతం కల్లు కోసం వివిధ ప్రాంతాలు తిరిగింది. నారాయణగూడ వద్ద అమెను పోలీసులు గుర్తించి.. భరోసా సెంటర్‌కు తరలించారు.
సంతోష్‌నగర్‌లో ఓ యువతి తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో సౌత్‌జోన్ డీసీపీ నేతృత్వంలో 10 బృందాలు రంగంలోకి దిగాయి. భరోసా కేంద్రం నుంచి షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష రాఘవేందర్ వెంటనే బాధితురాలితో మాట్లాడారు. ఆమె చెప్పి న అంశాలను పరిగణలోకి తీసుకొని సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ డేటా, అనుమానితులను విచారించారు. మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. వైద్యుల సలహాలు సూచనలు తీసుకొని వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు.