సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి తరలించిన రూ.60లక్షల విలువ చేసే మద్యాన్ని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు రోడ్డురోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ కథనం ప్రకారం… ఢిల్లీ, గోవా తదితర ప్రాంతాల్లో తక్కువ ధరకు లభించే మద్యాన్ని నగరంలో విక్రయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న మద్యం మాఫియాపై ఆరునెలలుగా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ దాడుల్లో మొత్తం 103కేసులు నమోదు చేసి రూ.60లక్షల విలువ చేసే 3077లీటర్ల మద్యంతోపాటు బీరు బాటిళ్లను స్వాధీనం చేశారు. ఈ అక్రమ మద్యాన్ని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఏఈ ఎస్. శ్రీనివాసరెడ్డి, సీఐ దేవేందర్‌రావు సమక్షంలో శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ముందు రోడ్ రోలర్‌తో తొకించి ధ్వంసం చేశారు.